Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గోధుమలు, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతుల పై ఆంక్షలు విధించిన కేంద్రం తాజాగా నూకలు (విరిగిని బియ్యం) కూడా ఆ జాబితాలో చేర్చింది. నూకల ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న వాటికి మాత్రం ఈ ఆంక్షల నుంచి సడలింపు కల్పించింది. సెప్టెంబరు 9- 15 వరకు ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ట్రక్కుల్లోకి లోడింగ్ ప్రారంభమైన, నౌకాశ్రయాలకు చేరిన నిల్వల ఎగుమతులకు కూడా ఆంక్షల నుండి మినహాయింపు కల్పించింది. అన్ని బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం మేర ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరిపంట విస్తీర్ణం పడిపోవడంతో దేశీయంగా సరఫరాలను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఎగుమతి సుంకం సెప్టెంబర్ 9 నుండి అమల్లోకి వస్తుందని తెలిపింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి పంట విస్తీర్ణం 5.62 శాతం తగ్గి 383.99 లక్షల హెక్టార్లకు చేరుకుంది. దిగుబడి తగ్గి నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆహార భద్రత దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బియ్యం ఎగుమతి దారుగా ఉన్న భారత్ ప్రపంచ వాణిజ్యంలో 40 శంత వాటాను కలిగి ఉంది. 2021-22లో దేశంలో 21.2 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. అందులో 3.94 మిలియన్ టన్నులు బాస్మతి బియ్యం. అదే సమయంలో 6.11 బిలియన్ డాలర్ల విలువైన బాస్మతి యేతర బియ్యాన్ని ఎగుమతి చేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021-22లో 150 కంటే ఎక్కువ దేశాలకు బాస్మతి యేరత బియ్యాన్ని ఎగుమతి చేసింది.