Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని, ఇది శుభ పరిణామమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీని ఓడించడమే ప్రజలు, ప్రతిపక్షాల ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. దేశాన్ని, ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రజల బతుకు తెరువును కాపాడాలంటే బీజేపీని గద్దె నుంచి దించాలని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు వేర్వేరు మార్గాల్లో సొంతంగా పోరాటాలు కొనసాగిస్తున్నాయని అన్నారు. 2024లో స్వేచ్చగా, పార దర్శకంగా ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోతుందని పేర్కొ న్నారు. శుక్రవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం వద్ద సీతారాం ఏచూరి మీడియాతో మాట్లా డారు. దేశంలో ప్రతి పౌరుడు ఇబ్బందుల్లో ఉన్నాడనీ, ప్రజలు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారని వివరించారు. మరోవైపు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు రాజకీయంగా దుర్వినియోగ మవుతున్నాయని, దేశ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, బీజేపీని ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. రోడ్ల పేరు మారిస్తే బానిసత్వం,పేదరికం పోదని ఎచూరి ఎద్దేవా చేశారు. రోడ్ల పేరు మార్చదం వల్ల ప్రజలకు ఉపయోగం లేదని, మానవ అభివద్ధి సూచిక, ప్రజల జీవన ప్రమాణల్లో భారత్ పరిస్థితి దిగజారిందని తెలిపారు.
2024 ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రావడం కాదుకదా, ఓటమి తథ్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అన్నారు. ప్రజా సమస్యలపై దేశంలో ప్రజా ఉద్యమాలు కూడా పెరు గుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరుగుతున్నదనీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల ఒత్తిడికను గుణంగా ఏకమవుతున్నాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో లౌకిక పార్టీలు కలవడం అవసరమని అన్నారు. లౌకిక పార్టీలన్ని కలిస్తే బీజేపీ మతోన్మాద రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడవచ్చని పేర్కొన్నా రు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక సాధ్యమతుందని అన్నారు. ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఎటువంటి పొత్తులు ఉండవనీ, రాష్ట్రాల్లో లౌకిక పార్టీల కూటములు ఉంటాయని తెలిపారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, 1998లో ఎన్డీఏ, 2004లో యూపీఏ 1 ప్రభుత్వాలు ఎన్నికల తరువాతే ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఎవరికి వారు ప్రయత్నాలు చేసినా, ఎన్నికల తరువాత అన్ని సర్దుకుంటాయని తెలిపారు.
బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆర్ఎస్కి మద్దతు
బీజేపీని ఓడించేందుకే మనుగోడులో టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చామని సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ముందుకు రావడం మంచిదేననీ, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాటానికి ముందుకు వచ్చిన స్వాగతిస్తామని అన్నారు. దేశాన్ని, ప్రజలను కాపాడు కోవాలంటే, బీజేపీని ఓడించాలని పేర్కొన్నారు. కేసీఆర్‌తో రాష్ట్ర స్థాయిలో పని చేసిన తరువాతే, దాని ఆధారంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తామని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ బలంగా ఉన్నదనీ, బీజేపీని ఓడించాలి కాబట్టే, టీఆర్ఎస్తో సీపీఐ(ఎం) ముందుకు వెళ్తున్నదని వివరించారు.
సీతారాం ఏచూరిని కలిసిన ఓం ప్రకాశ్ చౌతాలా
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్ఎల్డీ అధినేత ఓంప్రకాశ్ చౌతాలా భేటీ అయ్యారు. శుక్రవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరిని కలిసి చౌతాలా సెప్టెంబర్ 25న మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా జరిగే సమ్మాన్ దివస్‌కు ఆహ్వానించారు. అనంతరం ఏచూరితో కలిసి ఓం ప్రకాశ్ చౌతాలా మీడియాతో మాట్లాడుతూ సీతారాం ఏచూరికి, చౌదరి దేవి లాల్‌కు చిరకాల సంబంధం ఉన్నదనీ, అందుకే ఆయనను ఆహ్వానించారనని తెలిపారు. ఆ ర్యాలీకి ఏచూరి హాజరవుతానని చెప్పినట్టు పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనీ, ప్రతిపక్షాల ఐక్యత వారి కష్టాలను తీర్చగలదని అన్నారు. మతం, కులం పేరుతో దేశాన్ని విభజించిన ప్రస్తుత ప్రభుత్వం కారణంగా ఈ దేశంలోని ప్రతి పౌరుడు విచారంగా కలత చెందుతున్నాడని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి దేశంపై ప్రేమ లేదని, డబ్బుతో పాటు దేశాన్ని దోచుకోవడంలో నిమగమై ఉన్నారని విమర్శించారు. ''కచ్చితంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలోని ప్రజలందరూ చేరతారు. 2024లో అధికారంలో మార్పు ఉంటుంది'' అని చౌతాలా పేర్కొన్నారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ '' స్వయంగా ఇక్కడికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు చౌతాలాకి ధన్యవాదాలు. చౌదరి దేవి లాల్ దేశానికి గొప్ప నాయకుడు.మేం అతని నుంచి చాలా నేర్చుకున్నాం. చౌతాలా జయంతిని జరుపుకుంటున్నారనీ, అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించారు'' అని తెలిపారు. ''దేశంలోని ప్రతి పౌరుడు ఆందోళన చెందుతున్నాడు. వారికి ఎలా ఉపశమనం ఇవ్వాలో మేం ఆలోచిస్తున్నాం. ఈ బాధ్యత అన్ని ప్రతిపక్ష పార్టీలపై ఉంది. మేం దానిని ఎలా నెరవేరుస్తాం. దాని గురించి చర్చిస్తాం'' అని ఏచూరి అన్నారు. అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసానికి వెళ్లిన ఓం ప్రకాశ్ చౌతాలా ఆయనను కూడా ఆహ్వానించారు. ఐఎన్ఎల్డీ సెప్టెంబర్ 25న హర్యానాలోని ఫతేహాబాద్లో చౌదరి దేవిలాల్ జయంతి సందర్భాంగా నిర్వహించనున్న గౌరవ దినోత్సవ ర్యాలీకి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం, అఖిలేశ్ యాదవ్‌ను ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానించారు. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.