Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామకాల్లో ఎస్టీలకు అన్యాయం..
- కేంద్రం తీరుతో తీవ్రంగా నష్టపోతున్న షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు
న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు ఉన్నత విద్య, అందులో వారి ప్రాతినిధ్యం అనేది భారత సమాజంలో గిరిజన విద్యార్థులతో పాటు వారి వర్గాల అభివృద్ధికి ప్రధాన సూచికలలో ఒకటి. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం ఇది అంత ప్రభావవంతంగా కనిపించటం లేదు. ముఖ్యంగా, గిరిజన ఆచార్యుల సంఖ్య యూనివర్సిటీలల్లో ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతో ఆ వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే, సమస్యను పరిష్కరించటంలో మాత్రం కేంద్రం తగినంత శ్రద్ధ చూపటం లేదు. ఈ విషయంలో కేంద్రంపై గిరిజన సంఘాలు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిపుణులు, విశ్లేషకుల విశ్లేషణ ప్రకారం.. భారతీయ సమాజంలోని అన్ని రంగాలలో లోతుగా పాతుకుపోయిన కులతత్వం, జాత్యహంకారంతో ఉన్నత విద్య, ఉద్యోగం వంటి అవకాశాలను పొందలేకపోతున్న వారి కోసం ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలో కల్పించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం దాని అమలు అంతగా కనిపించటం లేదు. ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పటికీ ఈ వివక్షతను ఎదుర్కొంటున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు మరింతగా క్షీణించాయి. వారిపై పెత్తందారీ వర్గాల ఆధిపత్యం అధికమైంది. అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐఎం, ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐపీఈఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్), అశోక విశ్వవిద్యాలయం, జిందాల్ విశ్వవిద్యాలయం వంటి అభివృద్ధి చెందుతున్న ఇతర ప్రయివేటు ఇన్స్టిట్యూట్లు రిజర్వేషన్ల అమలు విషయంలో దయనీయంగా ఉన్నాయి.
ఏఐఎస్హెచ్ఈ నివేదికల ప్రకారం.. అన్ని విద్యా స్థాయిలలోని గిరిజన సంఘాల నుంచి తక్కువ స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)ని సూచించాయి. 2019-20 ఏఐఎస్హెచ్ఈ నివేదికలను పరిశీలిస్తే, జీఈఆర్ మొత్తం జాతీయ సగటు 27.1 కాగా, ఎస్టీ ల విషయంలో 18.0 గా ఉన్నది. ఎస్టీ విద్యార్థుల మొత్తం నమోదు 5.6 శాతంగా ఉండగా, వారి జనాభా భారతదేశంలో 8.6 శాతంగా ఉన్నది. ఇంకా, రాజ్యాంగం ఆదేశం ప్రకారం.. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ స్థానాల్లో ఎస్టీల శాతం 7.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ 2019-20 ఏఐఎస్హెచ్ఈ నివేదిక ప్రకారం ఇది 2.4 శాతంగా ఉన్నది.
ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐపీఈఆర్, ఏయిమ్స్ మొదలైన అన్ని ప్రభుత్వ సంస్థలకు తప్పనిసరి అయిన ప్రస్తుత రిజర్వేషన్ విధానాలను అమలు చేయటంపై తగినంత శ్రద్ధను సంబంధిత అధికార యంత్రాంగాలు చూపటం లేదు. ఇందులో తీవ్ర ఉల్లంఘనలు కనిపించాయి. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం.. భారత్‌లోని 23 ఐఐటీలలో ఎస్సీ, ఎస్టీ ల నుంచి విద్యార్థుల నమోదు రేటు ఎప్పటికప్పుడు తగ్గుతున్నది. రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన విధానం ప్రకారం రిజర్వేషన్ శాతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఉండాలి.
ఐదేండ్ల సమాచారం ప్రకారం.. 2015-2019 మధ్య అన్ని ఐఐటీల్లో మొత్తం అడ్మిషన్లలో కేవలం 2.1 శాతం ఎస్టీ, 9.1 శాతం ఎస్సీ విద్యార్థులు ప్రవేశించారు. సాధారణ కేటగిరి దరఖాస్తుదారుల రేటు మొత్తం అడ్మిషన్లలో 65.6 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.11,019 ఎస్సీ, 1809 ఎస్టీ దరఖాస్తుదారులలో వరుసగా 238, 40 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కావటం గమనార్హం. తిరుపతి, పాలక్కడ్‌లోని కొత్త ఐఐటీలలో కూడా అన్ని విభాగాల్లో ఎస్టీ విద్యార్థుల ప్రవేశం శూన్యంగా ఉన్నది. షెడ్యూల్డ్ తెగలు డాక్టరేట్ స్థాయిలో ఆదివాసీలకు ప్రాతినిధ్యం లేకపోవటంతో ఎస్టీ కోసం నేషనల్ ఫెలోషిప్‌ను పరిశీలించడానికి దారితీసింది. ఇప్పటికైన కేంద్రంలోని మోడీ సర్కారు ఈ విషయంలో తగిన శ్రద్ధ చూపెట్టాలని దళిత, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.