Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క మహారాష్ట్రలోనే 19 మరణాలు
న్యూఢిల్లీ :గణేశ్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ప్రమాద ఘటనల్లో అమాయక పౌరులు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో కొంతమంది చిన్న పిల్లలుండటం..అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 31న మొదలైన గణేశ్ ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. నవరాత్రుల అనంతరం వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు సాగాయి. మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన నిమజ్జన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్న పిల్లలతో సహా 25మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మహారాష్ట్రలోనే వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాద ఘటనల్లో 19మంది చనిపోయారు. వీరిలో 14మంది నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మృతిచెందారని పోలీసులు తెలిపారు. నాగపూర్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో గణేశ్ నిమజ్జనం కోసం గంగానదిలోకి వెళ్లిన ఇద్దరు మైనర్ బాలురు, మరో ముగ్గురు నదిలో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డారు. సోని పట్లోని యుమునా నదిలో ఇద్దరు మునిగి చనిపోయారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శుక్రవారం రాత్రి గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రక్కు వెనుక చక్రాల కింద పడి 20 ఏండ్ల విద్యార్థి మృతి చెందినట్టు వార్తలు వెలువడ్డాయి.