Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సిఎంకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో 50 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమ్మెకు సీఐటీయూ సంఘీభావం తెలియచేస్తున్నదనీ, జేఏసీ నిజమైన డిమాండ్లకు మద్దతు ఇస్తున్నదని తెలిపారు. సమ్మెలో లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని గతంలో హామీ ఇచ్చారనీ, వాటిని నెరవేర్చాలని కోరారు.
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ) పోస్టులను ఇటీవల రద్దు చేయడంతో వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తారనే ఏకైక ఆశను దెబ్బతీశారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మెకు ముందు వారు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నించారని, కానీ ఫలించలేదని తెలిపారు. దీంతో వారు ఈ సమ్మెకు దిగాల్సి వచ్చిందనీ, ఈ కాలంలో 28 మంది వీఆర్ఏలు మరణించారనీ, అది మీకు బాగా తెలుసని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం జోక్యం చేసుకొని వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించాలని సీఐటీయూ కోరుతున్నదని లేఖలో తపన్ సేన్ పేర్కొన్నారు. సంబంధిత ఉద్యోగుల సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తున్నదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.