Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది ఎరువుల కంపెనీల ప్రయివేటీకరణ!
- నష్టాల్లోంచి లాభాల్లోకి ఎగబాకిన 19 ప్రభుత్వరంగ సంస్థలు
- ప్రభుత్వ రంగ సంస్థల సర్వే స్పష్టం
న్యూఢిల్లీ : ఐదేండ్లలో 64 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్ఈ)లను మోడీ సర్కార్ మూసివేసింది. మరోవైపు క్లిష్టపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ సహకారం ఆశించినంతగా లేకపోయినా, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలను అధిగమించి, లాభాల్లోకి ఎగబాకుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ రంగ సంస్థల సర్వే 2020-21 నివేదికను విడుదల చేసింది. 2016-17 నుంచి 2020-21 వరకు ఐదేండ్లలోని 64 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, లిక్విడేషన్ (నగదీకరణ) చేయడం జరిగింది. 255 ఆపరేషనల్ కంపెనీల్లో 177 నికర లాభాన్ని, 77 సంస్థలు నికర నష్టాన్ని నమోదు చేశాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాభనష్టం లేదని ప్రకటించింది.
ఆపరేటింగ్‌లో ఉన్న కంపెనీలు..2016-17లో రూ.1.25 లక్షల కోట్ల నికర లాభాల్ని నమోదుచేయగా, 2020-21 నాటికి రూ.1.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న వాటి నికర లాభం రూ.1.38 లక్షల కోట్ల నుంచి రూ.1.89 లక్షల కోట్లుకు పెరిగింది. మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నికర విలువ రూ.12.47 లక్షల కోట్ల నుంచి రూ.13.62 లక్షల కోట్లకు పెరిగింది. ఎక్సైజ్ సుంకం, కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ, డివిడెండ్, ఇతర సుంకాలు, పన్నుల ద్వారా కేంద్ర ఖజానాకు చెల్లింపులు 3.79 లక్షల కోట్ల నుంచి రూ.4.96 లక్షల కోట్లకు పెరిగింది.
లాభాల్లో ఉన్న టాప్ 10 సీపీఎస్ఈలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్టిపిసి లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆర్ఈసీ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లు లాభాల్లో ఉన్నాయి.
సీపీఎస్ఈల్లో తగ్గిన నష్టాలు
2019-20లో రూ.44,277 కోట్ల నష్టాలు మూటకట్టుకున్న సిపిఎస్ఈలు, 31,219 కోట్లతో 2020-21లో నష్టాలను కాస్తా తగ్గించగలిగాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (రూ.7,453.01 కోట్లు), ఎయిర్ ఇండియా లిమిటెడ్ (రూ.7,017.42), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (రూ.2,717.14)ఈ మూడు సిపిఎస్ఈలే మొత్తం నష్టంలో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2019-20లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (రూ.8,046.51 కోట్లు), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( రూ.3,121.07 కోట్లు), మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (రూ.2,499.89 కోట్లు), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (రూ.1,233.88 కోట్లు) నష్టాలు ఉండగా, అవి 2020-21 నాటికి తగ్గాయి.
ఎనిమిది ఎరువుల సంస్థలు ప్రైవేటీకరణ!
పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఎరువుల రంగంలోని ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) ప్రభుత్వం గుర్తించింది. దీంతో రైతులపై తీవ్రమైన భారం పడుతుంది. రైతులకు చౌక ధరలతో సకాలంలో ఎరువులు అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బివిఎఫ్‌సిఎల్), ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఎఫ్ఏసీటీ), ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా (ఎఫ్‌సీఐఎల్), ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్ (ఎఫ్ఎజిఎంఐఎల్), మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్), హిందుస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ (హెచ్ఎఫ్సిఎల్) వంటి ఎనిమిది ఎరువుల సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం గుర్తించింది. కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వర్యంలో జరిగిన కోర్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ సమావేశంలో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనపై చర్చ జరిగింది. చాలా మంది సభ్యులు సూత్రప్రాయంగా ఈ ప్రణాళికతో ఏకీభవించినప్పటికీ, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎరువులు, ఉక్కు, పర్యాటకం వంటి వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, మూసివేయడం వంటి చర్యలతో ప్రభుత్వం ఈ రంగాల నుంచి నిష్క్రమించాలని భావిస్తోంది.