Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్ లేక మరణించారు..
- కోవిడ్ రెండో వేవ్ మరణాలపై ఆడిటింగ్ జరపాలి..
- ఆక్సిజన్ కొరత రావొచ్చని ముందే హెచ్చరించాం : పార్లమెంటరీ ప్యానెల్
న్యూఢిల్లీ : కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆక్సీజన్ కొరత, హాస్పిటల్లో వైద్య చికిత్స అందక వేలాది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు అనాథలయ్యాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఆరోగ్యం) తాజాగా కీలక (137వ) నివేదికను రాజ్యసభ ముందు ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడవచ్చు, రెండోవేవ్ తీవ్రంగా ఉంటుందని స్టాండింగ్ కమిటీ కేంద్రాన్ని ముందుగానే హెచ్చరించింది. 123వ నివేదికలో కమిటీ మోడీ సర్కార్‌కు పలు సూచనలు చేసింది. అయితే దీనిని సీరియస్‌గా తీసుకోలేదని తన 137 నివేదికలో స్టాండింగ్ కమిటీ పేర్కొన్నది. ఆక్సిజన్ కొరత వల్ల జరిగిన కోవిడ్ మరణాలపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆడిటింగ్ జరపాలని సూచించింది. కోవిడ్ మరణాలను 'దురదృష్టకర పరిణామం'గా కేంద్రం పేర్కొనటం సరైంది కాదని, ఇది తమను ఎంతగానో ఆందోళనకు గురిచేసిందని స్టాండింగ్ కమిటీ సభ్యులు నివేదికలో స్పష్టం చేశారు.
హాస్పిటల్స్‌పై ఒత్తిడి : స్టాండింగ్ కమిటీ
ఆక్సిజన్ కొరత వల్ల జరిగిన కోవిడ్ మరణాల సమాచారాన్ని కచ్చితంగా కేంద్రం రూపొందించాలి. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలి. ఈ విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర సంస్థల నుంచి పారదర్శకత, జవాబుదారీతనం ఆశిస్తున్నాం. భారీగా నమోదవుతున్న కోవిడ్ పాజిటీవ్ కేసుల వల్ల హాస్పిటల్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
మౌలిక వసతులు సరిపోవటం లేదు. ఆక్సీజన్ కోసం, సిలిండర్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలో నిల్చుతున్న వార్తాకథనాలు మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఆక్సిజన్ కొరత, సరఫరా దెబ్బతినటం గురించి 123వ నివేదికలో స్టాండిగ్ కమిటీ కేంద్రాన్ని హెచ్చరించింది. రెండో వేవ్ వస్తే పరిస్థితి దారుణంగ ఉంటుందని అంచనావేశాం. అయినప్పటికీ కేంద్రం మేల్కోలేదు. కనీసం రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లను కూడా పట్టించుకోలేదు. రెండో వేవ్‌లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదనుకుంటే, కోవిడ్ మరణాలపై సరైన సమాచారాన్ని రూపొందించాలని, ఆరోగ్య అత్యవసర సేవలను మరింత సమర్థవంతం చేయాల్సిన అవసరముందని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో తెలిపింది.