Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి స్థానంలో రాష్ట్ర స్థాయికి నిటి ఆయోగ్‌లు
- రాష్ట్రాల హక్కులకు పాతర
- త్వరలో ప్రక్రియ ప్రారంభించనున్న ఏపీ
- ఈ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం
న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో ప్లానింగ్ బోర్డుల (ప్రణాళిక సంఘాలు)ను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా రాష్ట్రాల హక్కులను లాక్కొనేందుకు కేంద్రం పన్నాగం పన్నుతోంది. అందులో భాగంగానే ప్లానింగ్ బోర్డుల స్థానంలో నిటి ఆయోగ్ తరహాలో రాష్ట్రాల్లో ఒక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఈ మేరకు సెప్టెంబరు 6న రాష్ట్ర ప్రణాళికా కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించిన నిటి ఆయోగ్ ఇప్పటికే ''స్టేట్ సపోర్ట్ మిషన్''పై విమర్శలు గుప్పించింది. రక్షణ, రైల్వేలు, హైవేలు మినహా, జీడీపీకి దోహదపడే అనేక ఇతర ముఖ్యమైన రంగాలు రాష్ట్రాల నిర్వహణలో ఉన్నాయి. విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాలపై ప్రధానంగా రాష్ట్రాలకు నియంత్రణ ఉంటుంది. అలాగే, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూ సంస్కరణలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం, రుణ ప్రవాహాం, పట్టణీకరణను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రే కీలకం. వాటిని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. రాష్ట్రాల హక్కులకు పాతర వేసేందుకు కుట్ర పన్నుతున్నది. దానికి నిటి ఆయోగ్ అనే అందమైన పేరును పెడుతోంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రణాళికా సంఘానికి బదులు నిటి ఆయోగ్ లాంటి వ్యవస్థ అవసరమని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
మొదటి దశలో 8 నుంచి 10 రాష్ట్రాలు
జాతీయ స్థాయిలోని నిటి ఆయోగ్ పర్యవేక్షణలో రాష్ట్రాల్లో తీసుకొచ్చే నిటి ఆయోగ్‌లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మొదటి దశలో దాదాపు 8 నుంచి 10 రాష్ట్రాల్లో ఈ విధానంతో ప్లానింగ్ బోర్డ్ స్థానాన్ని భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కర్నాటక, ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నాట్టు సమాచారం. మార్చి 2023 నాటికి అన్ని రాష్ట్రాల్లో నిటి ఆయోగ్ అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 65 ఏండ్ల ప్రణాళికా సంఘాన్ని 2015 జనవరిలో మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దాని స్థానంలో నిటి ఆయోగ్‌ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రణాళిక నిధుల కేటాయింపు అధికారాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్పగించింది. ప్రణాళిక సంఘం రద్దుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిటి ఆయోగ్ వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం వ్యయం తగ్గించింది. జాతీయ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం వంటి ప్రతిపాదనలు చేసింది. నిటి ఆయోగ్ సిఫార్స్ల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉన్న ఆస్తులను విక్రయించాలని సూచించింది. ఆ ప్రక్రియకు అనుకూలంగానే రాష్ట్ర స్థాయి ప్రణాళిక సంఘాలను రద్దు చేయాలని యోచిస్తోంది. ''ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా బోర్డుల నిర్మాణాన్ని పరిశీలించి, రాబోయే 4-6 నెలల్లో స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ (ఎస్ఐటీ)ని రూపొందించే బృందాలను రూపొందించడంలో సహాయపడటానికి నిటి ఆయోగ్ ఒక ప్రణాళికను రూపొందించింది. అధిక నాణ్యత విశ్లేషణాత్మక పని, విధాన సిఫార్సులను చేపట్టేందుకు ఎస్ఐటీల్లో నిపుణుల ప్రవేశం ప్రోత్సహించబడుతున్నది'' అని నిటి ఆయోగ్ చెబుతున్నది. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల పర్యవేక్షణ, మూల్యాంకనాన్ని చేపట్టడంతోపాటు పథకాల కోసం మెరుగైన సాంకేతికత, నమూనాలను సూచించడంపై బ్లూప్రింట్ తయారు చేయబడుతుంది.