Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా జాబితాలోకి 34 ఔషధాలు
- గత జాబితాలో 26 ఔషధాలు తొలగింపు:
విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా
న్యూఢిల్లీ: 27 కేటగిరీల్లో 384 అత్యవసర ఔషధాలతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం నేషనల్ లిస్ట్స్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం)-2022ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ విడుదల చేశారు. ఈ జాబితాలో కొత్తగా 34 మందులతో కలిపి 384 మందులు (టాబ్లెట్లు, క్యాప్సూల్లు) చేర్చబడ్డాయి. అయితే గత జాబితా నుంచి 26 మందులు తొలగించబడ్డాయి. ఔషధాలను 27 చికిత్సా విభాగాలుగా వర్గీకరించారు. 1996లో ఎన్ఎల్ఈఎం రూపొందించబడింది. ఇప్పటి వరకు 2003, 2011, 2015ల్లో మూడుసార్లు సవరించబడింది. 2011లో 348, 2015లో 376, 2022లో 384 ఔషధాలను ఎన్ఎల్ఈఎం జాబితాలో సవరించారు. ఔషధాలపై స్వతంత్ర స్టాండింగ్ నేషనల్ కమిటీ (ఎస్ఎన్సీఎం)ని 2018లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. నిపుణులు, భాగస్వామ్యదారులతో వివరణాత్మక సంప్రదింపుల తరువాత కమిటీ ఎన్ఎల్ఈఎం- 2015ను సవరించి, తన నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం కమిటీ సిఫారసులను ఆమోదించి, ఆ జాబితాను ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ సబ్కో దవాయి, సస్తీ దవాయి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. ''ఆరోగ్య సంరక్షణ అన్ని స్థాయిలలో సరసమైన, నాణ్యమైన ఔషధాల ప్రాధాన్యతను నిర్ధారించడంలో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్) గురించి అవగాహన పెంపొందిం చుకోవాలని నొక్కి చెప్పారు. శాస్త్రవేత్తలకు, సమాజానికి పెద్ద సవాలుగా ఉన్న ఎఎంఆర్ గురించి సమాజంలో అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) డాక్టర్ విజి సోమని, మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ మన్దీప్ కుమార్ భండారీ, ఎస్ఎన్సిఎం వైస్ చైర్మన్ వైకె గుప్తా, మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.