Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాషాయ పార్టీలోకి 8 మంది ఎమ్మెల్యేలు
పనాజీ : బీజేపీ మరోసారి తన వికృత రూపాన్ని ప్రదర్శించింది. గోవాలో కాంగ్రెస్‌ను మింగిసేంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేని కాషాయ పార్టీ ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి లాక్కోవడం పరిపాటిగా మారింది. తాజాగా గోవాలోనూ ఇదే బుద్ధిని చూపించింది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్‌తో సహా 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌కు ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది పార్టీ వీడటంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది. మూడింట రెండొంతల మంది పార్టీని వీడితే అనర్హత వేటు ఉండదు. బుధవారం ఉదయం ముందుగా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌తో విలీన ఫార్మాలిటీని పూర్తి చేయడానికి గోవా శాసనసభకు చేరు కోవడంతోనే ఈ హైడ్రామా ప్రారంభమయింది. తరువాత వీరంతా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ ప్రతిపక్ష నేత మిచ్చెల్ లోబో, అతని భార్య డాలియా లోబో, సీనియర్ ఎమ్మెల్యేలు అలెక్సో సెక్యూరియా, సంకల్ప్ అమోంకర్, రాడాల్ఫ్ ఫెర్నాండెస్, రాజేష్ ఫాల్డెస్సాయి, కేదార్ నాయక్ ఉన్నారు. వీరి చేరికతో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 28కు చేరుకుంది. మహారాష్ట్రవాది గోమంటక్ పార్టీ (ఎంజిపి), మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో బీజేపీకి మొత్తం 33 మంది మద్దతుగా ఉన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం ఏడుకు పడిపోయింది. వీరిలో ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు, గోవా ఫార్వర్డ్ పార్టీ, రివల్యూషనరీ గోన్స్ పార్టీ నుంచి ఒకొక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే ఫిరాయింపులపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. గోవాలో పూర్తిగా ప్రజాస్వామ్య విధ్వంసం జరిగిందని ఎఐసిసి ఇన్చార్జ్ దినేష్ గుండురావు విమర్శించారు. మంత్రి పదవులు, భారీగా నగదు ఆశగా చూపి ప్రతిపక్షాలను కూకటి వేళ్లతో పెకిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, నిరంకుశత్వం, డబ్బును విచ్చిలవిడిగా చెలాయించడం సిగ్గు చేటని ఆరోపించారు.