Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్‌ను విమర్శిస్తే.. తీవ్రవాది.. రాజద్రోహి ముద్ర
- ఎన్ఐఏ కేసులు, ఉపా, ఆయుధాల చట్టం..కింద ఆరోపణలు : రాజకీయ విశ్లేషకులు
- బ్రిటీష్ రాజ్‌ను కొనసాగిస్తూ..మరోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్..
- 2016-20 మధ్య ఉపా చట్టం కింద 6482 మంది జైల్లో నిర్బంధం
న్యూఢిల్లీ : బ్రిటీష్ పాలన..బీజేపీ పాలనకు పెద్దగా తేడా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయులపై వివిధ కేసులు నమోదుచేసి జైల్లో ఎలాగైతే నిర్బంధించారో...ఇప్పుడు మోడీ సర్కార్ కూడా అదే పని చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు నిర్వహించటం విడ్డూరంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌కు సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది, అయినా..ఈడీ కేసు పెండింగ్‌లో ఉందని అతడిపై జైలు నిర్బంధాన్ని కేంద్రం కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని జర్నలిస్టుల్ని, హక్కుల కార్యకర్తల్ని, మేథావుల్ని, విద్యార్థి సంఘం నాయకుల్ని అరెస్టు చేయటం, వారిపై 'తీవ్రవాద', 'రాజద్రోహ' ఆరోపణలు చేయటం సర్వసాధారణమైంది. సామాన్యులు, హక్కుల కార్యకర్తలపై బ్రిటీష్ కాలంనాటి చట్టాల్ని మోడీ సర్కార్ ప్రయోగిస్తూ...75ఏండ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది.
ఉపా కింద వేలాది మంది జైల్లో..
2016 తర్వాత ఉపాచట్టం కింద దాదాపు 6482మందిని అరెస్టు చేసి జైల్లో నిర్బంధించింది. వీరు చేసిన నేరం..కేంద్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శించటం. మోడీ సర్కార్ తప్పుల్ని ఎంచటం. బ్రిటీష్ పాలనలో రాజకీయ ఖైదీలపై 'తీవ్రవాదులు' అనే ముద్ర వేసేవారు. ఇప్పుడు మోడీ సర్కార్ సైతం బ్రిటీష్ రాజ్‌నే పాటిస్తోంది. రాజకీయంగా విమర్శిస్తే వారిపై రాజద్రోహం, ఉపా చట్టం, జాతీయ భద్రతా చట్టం, క్రిమినల్ చట్టం.. మొదలైనవి ప్రయోగిస్తోంది. స్వాతంత్ర సమరయోధుల్ని హీరోలుగా, పోరాట యోధులుగా కేంద్రం ఓ వైపు పేర్కొంటూనే, మరోవైపు బ్రిటీష్ రాజ్‌ను కొనసాగిస్తోందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘం నాయకులు, వైద్యులు, పర్యావరణ కార్యకర్తలు, కొంతమంది కమేడియన్లపైనా రాజద్రోహం, ఉపా చట్టాల్ని మోడీ సర్కార్ ప్రయోగించింది.
కుట్ర కేసులు..
మీరట్ కుట్ర కేసు (1929), కాన్పూర్ కుట్ర కేసు (1924)..మొదలైనవాటిలో వేలాది మంది స్వాతంత్య్ర సమర యోధుల్ని బ్రిటిషర్లు జైల్లో నిర్బంధించారు. ఇప్పుడు అదే ఫార్ములాను ఎంచుకున్న మోడీ సర్కార్, బీమా కోరేగావ్, ఢిల్లీ అల్లర్ల కేసుల్లో అనేకమంది జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల్ని నిందితులుగా పేర్కొంటూ జైల్లో నిర్బంధించింది. వీరందరిపైనా రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. దాదాపు 16మంది హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులపై 'తీవ్రవాదులు' అనే ముద్ర వేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్‌లో అనేకమందిపై ఉపా, ఎన్ఎస్ఏ, ఇతర రక్షణ చట్టాల్ని ప్రయోగించింది. ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం, అల్లర్ల చట్టం..కింద వందల సంఖ్యలో రాజకీయ ఖైదీలున్నారు. జులై 20, 2022నాటికి ఉపా కింద జైలు నిర్బంధాన్ని గురైన అండర్ ఖైదీలు 6482మంది ఉన్నారని జాతీయ నేర గణాంకాల బ్యూరో ఇటీవల గణాంకాల్ని విడుదల చేసింది.