Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఉప ఎన్నిక...
- రూ.20 లక్షల చొప్పున ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ల కొనుగోళ్లు
- అభివృద్ధి అంటూ రాజగోపాల్ రెడ్డి కుంటి సాకులు
- చారిత్రాత్మక తెలంగాణ పోరాటానికి బీజేపీ మతం రంగు
- ఆ పోరాటంలో ముస్లీంలు కూడా పాల్గొన్నారు
- 17న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభకు ఏచూరి హాజరు
- విభజన చట్టంలోని అంశాలు తక్షణమే అమలు చేయాలి : మీడియాతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
న్యూఢిల్లీ : తెలంగాణలో అక్రమ చొరబాటు కోసమే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ మేరకు బుధవారం నాడిక్కడ తెలంగాణ భవన్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకట్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు అక్రమ రూపంలో ఉప ఎన్నిక తీసుకొచ్చిందని, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి టీఆర్ఎస్ సహకరించటం లేదు కనుకనే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి కుంటిసాకులు చెబుతున్నాడని విమర్శించారు. కానీ, అక్కడ కాంగ్రెస్‌ను బలహీన పరిచి, టీఆర్ఎస్కు పోటీగా బీజేపీని తీసుకురావాలన్న కుట్రలో భాగమే ఈ ఉప ఎన్నిక అని విమర్శించారు. గెలవడం, రెండో స్థానం రావడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పోటీగా తెలంగాణ సమాజానికి ఒక సంకేతం ఇచ్చేందుకే ఈ ఉప ఎన్నిక అని తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరికి రూ.20 లక్షల ధర పెట్టి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే, నెల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతామని బహిరంగ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతోనే బీజేపీ ఉద్దేశ్యం స్పష్టమవుతుందనీ, దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఈడీ, సీబీఐ సంస్థలతో బెదిరించడం వంటి ప్రయత్నాలతో రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే ప్రయత్నం తెలంగాణలో చేస్తామని కేంద్ర హౌంమంత్రే బాహటంగా చెబుతున్నాడని విమర్శించారు.
టీఆర్ఎస్పై పోరాటం కొనసాగుతుంది
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుచేసిన పరిస్థితి లేదనీ, తాము ప్రజా సమస్యలు, పోడు భూములు, కార్మిక సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వంతో రోజూ పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకానికి పెను ప్రమాదంగా ముందుకు వస్తున్న బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని తెలిపారు. అయితే ఈ మద్దతు మునుగోడు ఉప ఎన్నిక వరకే ఉంటుందనీ, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడం అభినందనీయమని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే పని చేస్తామని ఇప్పుడే తాము గుత్తా తీసుకోలేదనీ, రాబోయే ఎన్నికల్లో అప్పటి పరిస్థితుల బట్టీ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ అంటే కోపమో, టీఆర్ఎస్ అంటే ప్రేమో అనే సందర్భం కాదని, తాము ఉత్తర భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కూడా మద్దతు ఇచ్చామని తెలిపారు.
మతాల మధ్య పోరుగా చిత్రీకరణకు మత పిచ్చిగాళ్లు ప్రయత్నం
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నిర్ణయం తీసుకుందనీ, భారత దేశంలో తెలంగాణ విలీనం కావడంలో బీజేపీ ఎటువంటి సంబంధం లేదన్నారు. నాటి భూస్వామ్య వర్గ వ్యతిరేక సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తున్నదనీ, నిజాంకు వ్యతిరేకంగా హిందూవులు చేసిన పోరాటంగా చిత్రీకరిస్తుందని విమర్శించారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని మతాల మధ్య పోరుగా చిత్రీకరించేందుకు మత పిచ్చిగాళ్లు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విమోచన దినం నిర్వహించాలని నిర్ణయించిందని, దీన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. వాస్తవంగా నాడు నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముస్లీంలూ అనేక మంది పాల్గొన్నారని తెలిపారు. విసునూర్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాటంచేసిన పేద రైతు షేక్ బందగీ, నైజాంకు వ్యతిరేకంగా గళం వినిపించిన ప్రముఖ కవి మఖ్దూం మొహియుద్దీన్, నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా రచనలు చేసి చేతులు నరికివేతకు గురైన షోయబుల్లా ఖాన్ వంటి అనేక మంది ముస్లీంలు ఆ పోరాటంలో పాల్గొన్నారని అయ్యారని తెలిపారు. నిజాం సంస్థానంలో రాజు ఒక్కడే ముస్లీమనీ, అందులో జాగీర్దార్లు, జమీన్దార్లు అందరూ హిందువులేనని గుర్తుచేశారు. 1.50 లక్షల ఎకరాలతో పెద్ద భూస్వామి విసునూరు రామచంద్రారెడ్డి హిందూవని తెలిపారు. పోరాడినవాళ్లలో హిందువులతో పాటు ముస్లీంలు కూడా ఉన్నారని అన్నారు.
వారం రోజుల పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్సికోత్సవాలు
అందుకే తెలంగాణ సాయుధ పోరాట వాస్తవా గాథను వివరించేందుకు వీరనారీ ఐలమ్మ వర్థంతి సెప్టెంబర్ 10 నుంచి నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన వరకు సెప్టెంబర్ 17 వరకు వారం రోజుల పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సీపీఐ(ఎం) నిర్వహిస్తున్నదని తెలిపారు. సెప్టెంబర్ 17న జనగామ, మిర్యాలగూడలో జరిగే సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారనీ, హైదరాబాద్‌లో జరిగే సదస్సులో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఎ.విజయ రాఘవన్ పాల్గొంటారని అన్నారు.
విభజన చట్టంలోని అంశాలు వెంటనే అమలు చేయాలి
విభజన జరిగి ఎనిమిదేళ్లైనా ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోవడంత హాస్యాస్పదమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఇంకా అమలు చేయలేదనీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నీటీ పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పన, కేంద్ర విద్యా సంస్థలు నెలకొల్పడం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటువంటి ఏ సమస్యా అమలుకు నోచుకోలేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం కంటితుడుపు చర్యేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమస్యలు పరిష్కరించాలనీ, చట్టంలో పేర్కొన్న అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌కు మహనీయుడు అంబేద్కర్ పేరును పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేయడంలో తమకు అభ్యంతరం ఏమీ లేదని, అదే అంశంపై చర్చ జరిగే తమ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. తమ్మినేని కష్ణయ్య హత్య విషయంలో తప్పుడు ఆరోపణలని పోలీసులే తేల్చారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.