Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీడీపీలో 1.3శాతం దిగువకు.. ప్రభుత్వ వ్యయం
- రాష్ట్రాలపైనే పూర్తిభారమేస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ : తీవ్రమైన ఆరోగ్య సమస్య ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రభుత్వరంగంలో మెరుగైన వైద్యం, ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తే..ఆ కుటుంబానికి లభించే ఉపశమనం వెలకట్టలేనిది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రజారోగ్యంపై మన పాలకులు శ్రద్ధ పెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వ వ్యయం రానురాను తగ్గుముఖం పట్టడం కోట్లాది కుటుంబాల్ని ఆర్థికంగా కుదేలు చేస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం 2018-19నాటికి జీడీపీలో 1.28శాతానికి పరిమితమైందని ఇటీవల విడుదలైన 'జాతీయ ఆరోగ్య ఖాతాల' గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే రోగులు తమ జేబు నుంచి ఖర్చు చేయటం జీడీపీలో 1.52శాతంగా నమోదైంది. 15ఏండ్లలో ఆరోగ్య సేవలపై మొత్తం వ్యయం 4.3శాతం నుంచి 3.16 శాతానికి పడిపోయింది. 2004 నుంచి 2018-19 మధ్యకాలంలో ప్రభుత్వ వ్యయం 1.3శాతం (జీడీపీలో) దిగువకు పడిపోవటం ఇదే మొదటిసారి. నిజానికి గత 15ఏండ్లుగా ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులు, వ్యయం గణనీయంగా పెరిగాయి. దీనివల్లే మొత్తంగా ప్రభుత్వ వ్యయం 22.5శాతం నుంచి 40.6శాతానికి చేరుకుంది. అయితే ఆరోగ్యం..రాష్ట్ర జాబితాలోని అంశంగా కేంద్రం తరుచూ ప్రస్తావిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యంపై కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. ఆరోగ్య సేవల భారాన్ని రాష్ట్రాలే భరించాలనే విధానాన్ని అనుసరిస్తోంది. నిధుల్లో అత్యధిక భాగం (34శాతం) ఔషధాలు, కౌంటర్లలో రోగులకు ఇచ్చే మందులు, డాక్టర్ రాసిన మందులపై ఖర్చు అవుతోంది. 34.6శాతం ఇన్పేషెంట్ కేర్ కోసం, 19శాతం ఔట్ పేషెంట్ వైద్య చికిత్సపై నిధులు వ్యయమవుతున్నాయి. గత 15ఏండ్లలో ఆరోగ్య సేవల్లో ప్రయివేటురంగం భారీగా విస్తరించింది. విడుదల అవుతున్న మొత్తం నిధుల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆరోగ్య సేవల కోసం 17శాతం ఖర్చు అవుతుండగా, ఇది ప్రయివేటు హాస్పిటల్స్లో 28.7శాతంగా ఉంది.