Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక స్తోమత, నీట్లో మెరిట్ రాకపోవడంతోనే విదేశాలకు వెళ్లారు
- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి సడలింపులను అనుమతించడం వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేయడానికి సోమవారం వరకూ గడువు ఇవ్వాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ కేసు విచారించాల్సి ఉందని శుక్రవారమే ఉక్రెయిన్ విద్యార్థుల కేసు విచారిస్తామని స్పష్టంచేసింది. దీంతో గురువారమే కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ చట్టంలో ఎటువంటి నిబంధన లేనందున దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం సాధ్యంకాదని అఫిడవిట్లో పేర్కొంది. నీట్లో తక్కువ మార్కులు రావడం, ఆర్థిక స్థోమత వంటి రెండు కారణాలతో వారంతా ఉక్రెయిన్ వెళ్లారని తెలిపింది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేసే అవకాశం వారికి కల్పిస్తామని తెలిపింది. ఆయా విద్యార్థులకు సహాయం చేయడానికి అపెక్స్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ, నేషనల్ మెడికల్ కమిషన్లతో కేంద్రం సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపట్టామని తెలిపింది. నీట్లో మెరిట్ తక్కువగా ఉన్న ఈ విద్యార్థులకు దేశంలో ప్రవేశాలు కల్పిస్తే ఆయా కళాశాలల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి అనేక వ్యాజ్యాలు కోర్టుకు వస్తాయని పేర్కొంది. ఒకవేళ ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు దేశీయంగా ప్రయివేటు కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతిస్తే ఫీజుల భారం తట్టుకోలేరని పేర్కొంది. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా కోర్సును పూర్తి చేయలేని విద్యార్థుల నిమిత్తం సెప్టెంబరు 6న నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీసుతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే ఆ నోటీసు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారతీయ కళాశాలల్లో దొడ్డిదారి ప్రవేశాలు (బ్యాక్ డోర్ ఎంట్రీ)గా భావించరాదని స్పష్టం చేసింది.
ఆ యూనివర్సిటీల్లో చదువుకోవచ్చు
అకడమిక్ మొబిలిటీ పోగ్రామ్ కింద ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. పోలాండ్, చెక్‌రిపబ్లిక్, ఫ్రాన్స్, జార్జియా, కజకిస్తాన్, లుథియానా, మోల్డోవా, స్లోవేకియా, స్పెయిన్, ఉజ్బెకిస్తాన్, అమెరికా, ఇటలీ, బెల్జియం, ఈజిప్టు, బెలారస్, లాత్వియా, కిర్గిస్తాన్, గ్రీస్, రొమేనియా, స్వీడన్, ఇజ్రాయెల్, ఇరాన్, అజర్బైజాన్, బల్గేరియా, జర్మనీ, టర్కీ, క్రొయేషియా, హంగేరీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది. అయితే, డిగ్రీ మాత్రం ఉక్రెయిన్‌లోని మాతృ యూనివర్సిటీ ప్రధానం చేస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా దేశాల్లో అకడమిక్ మొబిలిటీ ప్రొగ్రామ్ కింద వైద్య విద్య పూర్తిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. విద్యార్థులు ఈ ప్రొగామ్ను స్వీకరించాలని సూచించింది.