Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగం, జీవనోపాధిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పట్ల పెరిగిన వివక్ష
- ఆదాయ అసమానతలకు ఇదే ప్రధాన కారణం : ఆక్స్ఫామ్ ఇండియా తాజా నివేదిక
- సామాజికంగా..ఆర్థికంగా తీవ్రమైన పరిస్థితుల్లోకి నెడుతోంది..
- దినసరి కూలిగా పురుషుల సగటు ఆదాయం రూ.6వేలు..మహిళలకు రూ.3వేలు
- రెగ్యులర్ ఉద్యోగాల్లో ముస్లింలకన్నా ముస్లీమేతరుల ఆదాయం 49శాతం ఎక్కువ
న్యూఢిల్లీ : గతంతో పోల్చితే భారత్లో దళితులు, గిరిజనులు, ముస్లింల పట్ల వివక్ష మరింత పెరిగిందని, ఉద్యోగాలు, జీవనోపాధి, వ్యవసాయ రుణాలు పొందటంలో అసమానతలు పెరగటానికి ముఖ్యకారణం వివక్షేనని 'ఆక్స్ఫామ్ ఇండియా' తాజా నివేదిక వెల్లడంచింది. ఎస్సీ, ఎస్టీల కన్నా మిగతా సామాజిక వర్గాలకు చెందినవారి నెలవారి సగటు ఆదాయం రూ.5వేలు ఎక్కువగా ఉందని, ముస్లింల సగటు ఆదాయంతో పోల్చితే ముస్లిమేతరుల సగటు ఆదాయం రూ.7వేలు ఎక్కువగా ఉందని 'ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022' పేర్కొన్నది. పట్టణాల్లో నివసించే ముస్లిం జనాభాలో 15.6శాతం మందికి (15ఏండ్లు పైబడిన) రెగ్యులర్ ఉద్యోగాలుండగా, ముస్లీమేతరుల్లో 23.3శాతంగా (2019-20నాటికి) నమోదైందని నివేదిక తెలిపింది. ఆక్స్ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహార్ మాట్లాడుతూ..''నేడు దేశంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వివిధ రూపాల్లో వివక్షకు గురవుతున్నారు. ఇది వారిని సామాజికంగా, నైతికంగానేగాక, ఆర్థికంగానూ తీవ్రమైన పరిస్థితుల్లోకి నెడుతోంది'' అని చెప్పారు. కార్మిక, ఉపాధి రంగాలపై కేంద్రం విడుదల చేసిన గణాంకాల (2004-2020) ఆధారంగా నివేదిక రూపొందించామని తెలిపారు. నివేదికలోని ముఖ్యాంశాలు ఈవిధంగా ఉన్నాయి.
లింగ వివక్ష
గ్రామీణ ప్రాంత మహిళల ఆదాయ అసమానతలకు 100శాతం కారణం లింగ వివక్షే. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న లేబర్ మార్కెట్లో ఇది 98శాతంగా ఉంది. పురుషులతో పోల్చుకుంటే సమాన విద్యార్హత, అనుభవం ఉన్నప్పటికీ లేబర్మార్కెట్లో మహిళలకు తక్కువ వేతనాలు, కూలి అందుతోంది. స్వయం ఉపాధిలో మహిళలకన్నా పురుషుల ఆదాయం 2.5రెట్లు ఎక్కువగా ఉంది. 83శాతం కారణం లింగ వివక్షకాగా, దినసరి కూలిలో స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు 95శాతం లింగ వివక్ష కారణమైంది. పురుషులు దినసరి కూలి ద్వారా సగటు నెల ఆదాయం రూ.6వేలు ఉంటే, మహిళల ఆదాయం కేవలం రూ.3వేలకు పరిమితమైంది.
కుల..మత వివక్షలే ప్రధాన కారణం
పట్టణ ముస్లింలో 68శాతం ఉపాధిలేమితో బాధపడుతున్నారు. రెగ్యులర్ వేతనాలు అందుకున్న కార్మికరంగంలో ముస్లీం-నాన్ ముస్లిం మధ్య ఆదాయ అసమానతలు 70శాతానికి చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం మత వివక్ష. స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీల ఆదాయం రూ.5వేలు తక్కువగా ఉంది. ఆదాయ అసమానతల్లో 41శాతం వివక్ష ప్రధాన కారణంగా ఉందని అధ్యయనం తేల్చింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల పట్ల కుల వివక్ష గణనీయంగా పెరిగింది. దినసరి కూలీగా ఉపాధి పొందటం కష్టతరంగా మారింది. ఈ సామాజిక వర్గాలు ఆదాయ అసమానతలకు గురవ్వడానికి కుల వివక్ష 79శాతం కారణమని గణాంకాలు చెబుతున్నాయి. క్రితం ఏడాదితో పోల్చితే కుల వివక్ష 2019-20లో 10శాతం పెరిగింది.
వేధిస్తోన్న నిరుద్యోగం
ఉద్యోగం, జీవనోపాధి, వ్యవసాయ రుణాలు పొందటంలో దళితులు, ఆదీవాసీలు, ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష క్రితం ఏడాదితో పోల్చితే మరింత పెరిగింది. దీనివల్ల ఆయా వర్గాలకు చెందినవారి ఆదాయాలు గణనీయంగా పడిపోతున్నాయి. ముస్లింలు ఆదాయ అసమానతలకు గురి కావడానికి ప్రధాన కారణం 68.3శాతం మత వివక్షే. ఇది 2004-05లో 59శాతం ఉండేది. ఈ 16ఏండ్లలో వివక్ష 9శాతం పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలలో నిరుద్యోగం చాలా వేగంగా పెరిగింది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో నిరుద్యోగం 17శాతం పెరిగింది. వేతన ఉద్యోగులుగా ఉన్న ముస్లింలపై కోవిడ్ సంక్షోభం దారుణమైన దెబ్బ కొట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 41శాతం ముస్లింలు ఉపాధి కోల్పోయారు. ఎస్సీ, ఎస్టీల్లో 28.3శాతం మంది, జనరల్ కేటగిరీలో 28.1శాతం మంది ఉపాధి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో కల్లా..అత్యధికంగా ముస్లింల ఆదాయం 13శాతం తగ్గుదల నమోదైంది. ఇది ఇతర వర్గాల్లో 9శాతంగా కనపడింది. స్వయం ఉపాధి కలిగిన ముస్లింల ఆదాయం 18శాతం పడిపోగా, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఆదాయం 10శాతం పడిపోయింది.