Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయమూర్తులు వయస్సు 65 ఏండ్లకు..
- సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వయస్సు 67 ఏండ్లకు..
- తక్షణమే రాజ్యాంగ సవరణ చేయండి
- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏకగ్రీవ తీర్మానం
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 67 ఏండ్ల కు పెంచాలని, తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానం చేసింది. అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించాయి. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచాలని, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్ల నుంచి 67 ఏండ్లకు పెంచాలని తీర్మానించింది. అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు చైర్మెన్లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని పార్లమెంటుకు ప్రతిపాదించాలని తీర్మానం చేసింది. తీర్మానంపై తక్షణ చర్య కోసం తీర్మానం కాపీని ప్రధాని మోడీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి పంపాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
తొలినాళ్లలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 ఏండ్ల కే పరిమితం కాగా, 1963 అక్టోబర్ నుంచి 62 ఏండ్ల కు పెంచారు. ఈ వయసును 65 ఏండ్లకు పెంచే ఉద్దేశంతో 2010 ఆగస్టు 25న లోక్‌సభలో 115వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ఆ బిల్లు ఆమోదం కాలేదు. ఆలోపు 15వ లోక్‌సభ పదవీకాలం ముగిసిపోయింది. 1974లో లా కమిషన్ తన 58వ నివేదిక హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు మధ్య సమానత్వాన్ని తీసుకురావాలని సిఫారసు చేసింది. 2002లో జస్టిస్ వెంకటాచలయ్య నివేదిక (రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్ నివేదిక) హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును వరుసగా 65, 68 ఏండ్లకు పెంచాలని సిఫారసు చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ కూడా జడ్జీల పదవీ విరమణ వయసును పెంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ''ఎవరైనా రిటైర్ అవడానికి 65ఏండ్లు చాలా చిన్న వయసు అని నేను అనుకుంటున్నా'' అని ఆయన అన్నారు. అటు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కూడా పలుమార్లు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపును సమర్థించారు. అయితే ఇటీవలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (జులై 21న) కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో మాట్లాడుతూ మాట్లాడుతూ సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన లేదని తెలిపారు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాలనే ఆలోచన దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని అన్నారు.
సుప్రీం కోర్టులో 13 రోజుల్లో 5,113 కేసుల పరిష్కారం
- 17 రోజుల్లో 3,788 కేసులు దాఖలు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 17 రోజుల్లోనే దాదాపు 3,788 కేసులు నమోదయ్యాయని అత్యున్నత న్యాయస్థానం రికార్డులు చెబుతున్నాయి. అలాగే గత 13 రోజుల్లో సుప్రీం కోర్టులో 5,113 కేసులు పరిష్కారం అయ్యాయి. సీజేఐ జస్టిస్ యుయు లలిత్ కొత్త కేసుల లిస్టింగ్ విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి గత 13 రోజుల్లో 3,618 ఇతర వ్యవహారాలు, 283 సాధారణ విచారణ వ్యవహారాలు, 1,212 బదిలీ పిటిషన్లు సుప్రీం కోర్టు పరిష్కరించింది. ఆగస్టు 29 నుంచి నేటి వరకు దాఖలైన కేసుల్లో మొత్తం 1,135 సాధారణ కేసులు దాఖలు కాగా, 875 కేసులు రీఫైలింగ్ అయ్యాయి. 797 ఇతర కేసులు నమోదు కాగా, 981 వెరిఫైడ్ కేసులు నమోదు అయినట్లు అత్యున్నత న్యాయస్థానం రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాత లలిత్ ప్రవేశపెట్టిన మొదటి మార్పు విచారణకు సంబంధించినది. నాన్-మిసిలేనియస్ రోజులలో సుప్రీం కోర్ట్ ప్రస్తుతం ఉదయం సెషన్లో (ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు), నోటీసు తర్వాత మధ్యాహ్నం సెషన్లో (మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు) సాధారణ విషయాలను విచారిస్తుంది.