Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆ రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు కొల్కతా మున్సిపల్ కార్పొరేషన్లో విద్యార్థులు, యువజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ నగర వీధుల్లో తీవ్ర ఆంక్షలు విధించింది. అడుగడుగునా పెద్దపెద్ద బారికేడ్లను ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేసి అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది. యువతను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ఉపయోగించారు. అయినా యువత బారికేడ్లను చేధించుకొని, జలఫిరంగులను ఎదుర్కొని ముందుకు దూసుకెళ్లింది. కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 29 వేల పోస్టులను భర్తీ చేయాలని యువత డిమాండ్ చేసింది. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో వామపక్ష యువజన, విద్యార్థి సంఘాలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు.