Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 నుంచి 18 వరకు 24వ సీపీఐ జాతీయ మహాసభ
- 20 దేశాల కమ్యూనిస్టు, వర్కర్స్, సోషలిస్టు సౌహార్ధ ప్రతినిధులు హాజరు
- 15న ప్రారంభ సభకు ఏచూరితో పాటు వామపక్ష నేతలు హాజరు
- 16-17 లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగంపై జాతీయ సదస్సులు
- సీఎంలు పినరయి విజయన్, ఎంకె స్టాలిన్, నితీశ్ కుమార్ తదితరులు రాక : సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్ణయం
న్యూఢిల్లీ: సీపీఐ 24వ జాతీయ మహాసభ అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్నాయనీ, అందులో భాగంగా అక్టోబర్ 14 భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గం పేర్కొంది. సీపీఐ ప్రధాన కార్యాలయం (అజరు భవన్)లో రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశం గురువారం ముగిసింది. అనంతరం ప్రకటన విడుదల చేసింది. 24వ జాతీయ మహాసభల్లో చర్చించాల్సిన అంశాలపై జాతీయ కార్యవర్గ సమావేశం చర్చించిందని తెలిపింది. మహాసభకు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 845 ప్రతినిధులు, పరిశీలకులు హాజరు అవుతారని తెలిపింది. 20 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీలో వర్కర్స్ పార్టీలు సోషలిస్ట్ పార్టీల నాయకులు సౌహార్ధ ప్రతినిధులుగా హాజరవుతారు. అక్టోబర్ 15న ప్రారంభ సభకు సీపీఐ నేతలతో పాటు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్), ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ నేతలు హాజరవుతారని, 16,17 తేదీల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం అంశాలపై జరిగిన సెమినార్లకు బీజేపీయేతర, లౌకిక, వామపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామని తెలిపింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొంటారని తెలిపింది.
సమావేశ అనంతరం తెలంగాణ భవన్ వద్ద మాజీ రాజ్యసభ ఎంపీ అజీజ్ భాషాతో కలిసి చాడ వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడారు. 24వ జాతీయ మహాసభల్లో దేశానికి దశ దిశ నిర్దేశించే రాజకీయ తీర్మానం చేస్తామని తెలిపారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. కేంద్రం ఇప్పటికి విభజన హామీలు నెరవేర్చలేదని, మైనార్టీల పై, దళితులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులతో ఒక వేదిక ఏర్పాటు కావాలని అన్నారు. ప్రతిపక్షాల ప్రభుత్వాలపై మోడీ సర్కారు కుట్ర చేస్తోందనీ, తెలంగాణ రాజకీయ పొందికరణలో మార్పులు రాబోతున్నాయని తెలిపారు. కెేసీఆర్ బీజేపీకి వ్యతిరేక వైఖరి తీసుకున్నాక ప్రగతిశీల శక్తులు ఏకమవుతున్నాయని, మునుగోడులో బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన హామీలు పరిష్కరించాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టకు జాతీయ హౌదా కల్పించాలని డిమాండ్ చేశారు.