Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే..
- అమరావతి నుంచి రాజధాని మారుస్తా అనలేదు
- ఆ ప్రాంతాల్లో కావాలని మాత్రమే చెప్పా :శాసనసభలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి
అమరావతి: అమరావతి నుండి రాజధానిని తీసివేయాలని తాను ఎప్పుడూ చెప్పలేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వికేంద్రీకరణ- పరిపాలనా సంస్కరణలు అనే అంశంపై శాసనభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ విశాఖ, కర్నూలుకు కూడా రాజధాని కావాలని మాత్రమే తాను అన్నానని చెప్పారు. అమరావతి పట్లతనకు వ్యతిరేకత లేదని చెప్పారు. ఇక్కడ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధికి
నాలుగు లక్షల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబే చెప్పారని, అంతడబ్బు ఎక్కడ నుండి తేగలరని ప్రశ్నించారు. ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పనులు పూర్తికావని అన్నారు. కట్టలేని, కట్టని రాజధాని కోసం చంద్రబాబు ఇక్క కృత్రిమ రియల్ఎస్టేట్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని, మిగిలిన ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. పెత్తందార్ల కోసమే ఆందోళనలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్ రూ.2.27 లక్షల కోట్లు పెట్టారని, ఇప్పుడూ అంతే మొత్తంలో బడ్జెట్ ఉందని తెలిపారు. అంత బడ్జెట్ పెట్టినా సంక్షేమ పథకాలు బాబు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బాబు హయంలో రాజధాని నిర్మాణం డిజైన్స్కే పరిమితమైందని పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో రూ.5674 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, వాటితోనే గ్రాఫిక్స్ చూపించారని చెప్పారు. ఏడాదికి రూ.1000 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని,పైగా రూ.2297 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్లారని చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారిపై 420 కేసు పెట్టాన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది తెల్లరేషన్కార్డుదారులేనని, ఈ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా పాలన చేస్తే ఎలా అని ప్రశ్నించారు. లక్షకోట్లు వెచ్చించి అమరావతిని కట్టాలంటే 100 సంవత్సరాలు పడుతుందని అన్నారు. ఇక్కడ పెట్టే దానిలో పదిశాతం ఖర్చుతో విశాఖపట్నం అభివృద్ది చెందుతుందని చెప్పారు. విశాఖకు కొద్ది తోడ్పాటును అందిస్తే ఇంకా పెద్దనగరం అవుతుందని వివరించారు. అమరావతి రాజధాని అంటున్న చంద్రబాబు తన హయంలో విజయవాడ, గుంటూరుకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడలో పలు ప్రాంతాలను అభివృద్ది చేశామని వివరించారు. అంబేద్కర్ పార్కు రూ.260 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. 15,004 గ్రామ సచివాలయాల వ్యవస్థతో 2.70 లక్షలమంది వాలంటీర్లతో ప్రజలకు విశేష సేవలదిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా పరిపాలనా వికేంద్రీకరణలో భాగమని వివరించారు. క్షేత్రస్థాయిలోకి పాలన తీసుకెళ్లడం వల్ల వరదల సమయంలోనూ, కోవిడ్ సమయంలో అందరికీ సాయం అందించగలిగామని వివరించారు. అన్నేళ్లు సిఎంగా ఉన్న వ్యక్తి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని లేఖ రాశారని, వెంటనే చేశామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రసంగం సమయంలో విజయవాడలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ప్రదర్శించారు.