Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఇండియన్ యూనియన్‌లో తెలంగాణ విలీనం తరువాత కూడా సాయుధ పోరాటం సాగింది. చాలా చర్చలు తరువాత కమ్యూనిస్టులు పోరాటం నిలిపివేసిన అనంతరం ఆర్మీ వెనక్కి వెళ్లింది. నిజాం పారిపోయిన తరువాత తెలంగాణ కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లకుండా ఆర్మీని మోహరింప చేశారు.వాస్తవ చరిత్ర ఇది. కానీ బీజేపీ చరిత్రను మార్చేందుకు కుట్ర పన్నుతోంది. హిందూ, ముస్లీం విభజన... నియంతృత్వ రాజకీయాల్లో భాగమే.
న్యూఢిల్లీ : దేశంలో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా విశాల లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష విశాల ఐక్యతతో సమీకరణ అవసరమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో రెండు రోజుల పాటు జరిగిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం ముగిసింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. బీహార్‌లో ప్రభుత్వం మార్పు తరువాత ప్రతిపక్షాల విశాల ఐక్యతా చర్చ విస్తృతం అయిందనీ, ఇదొక శుభపరిణామమని అన్నారు. హిందూ మతోన్మాదానికి, హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా విస్తృత సమీకరణ జరుగుతున్నదని తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగిస్తామనీ, దీనిపై నిర్మాణాత్మక చర్యలు చేపడతామని చెప్పారు. అందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తాయనీ, ఈ అవగాహనలతో రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాట్లు జరుగుతాయని అన్నారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు ఏకం కానున్నాయని చెప్పారు. ఎన్నికల పొత్తులు, అవగాహనలు, సీట్ల సర్దుబాట్లు అన్నీ రాష్ట్ర స్థాయిలోనే ఉంటాయని, జాతీయ స్థాయిలో సాధ్యం కాదన్నారు.
చరిత్రను మార్చేందుకు బీజేపీ కుట్ర
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా 1951 వరకు ఉద్యమించారని గుర్తు చేశారు. ఐదేండ్ల పాటు వేలాది గ్రామాల్లో భూ స్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని, పేద ప్రజలకు కమ్యూనిస్టులు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజా పాలనను నిర్మించారని తెలిపారు. ఇండియన్ యూనియన్‌లో తెలంగాణ విలీనం తరువాత కూడా సాయుధ పోరాటం సాగిందనీ, చాలా చర్చలు తరువాత కమ్యూనిస్టులు పోరాటం నిలిపివేసిన తరువాత ఆర్మీ వెనక్కి వెళ్లిందని స్పష్టంచేశారు. నిజాం పారిపోయిన తరువాత తెలంగాణ కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లకుండా ఆర్మీని మోహరింప చేశారని వివరించారు. ఇది వాస్తవ చరిత్ర అనీ, కానీ బీజేపీ చరిత్రను మార్చేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. హిందూ, ముస్లీం విభజన... నియంతత్వ రాజకీయాల్లో భాగమేనని విమర్శించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో కలవడానికి ఇష్టపడని, స్వతంత్రంగా ఉండాలనుకునే జమ్ముకాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తున్నారని, హైదరాబాద్ వలే అక్కడ ఆర్మీ వెళ్లి రాజా హరిసింగ్‌కు మద్దతుగా ఉందని వివరించారు. రాజా హరి సింగ్ హిందువు కనుక ఆయనను హీరోగా కీర్తిస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించి నిజాం ముస్లీం కనుక ఆయన నుంచి విమోచనగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని సీపీఐ(ఎం) నిర్ణయించినట్టు చెప్పారు.
కుల ఆధారిత జనగణనపై...
కుల ఆధారిత జనగణన అవసరమని తమ పార్టీ అభిప్రాయ పడుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. జనగణనలో తొలిసారి విరామం వచ్చిందనీ, గతంలో ఎన్నడూ లేదన్నారు. జనగణన త్వరగా ప్రారంభించాలని అన్నారు. పాలసీలు తయారు చేసేందుకు జనగణన చాలా ముఖ్యమని తెలిపారు.
బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు
కేరళలో బీజేపీకి సీపీఐ(ఎం) ఏ టీం అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఏచూరి స్పందించారు. తాము అధికారంలో ఉన్న కేరళలో ఒక ఎమ్మెల్యే ఉన్న బీజేపీ ఆ తర్వాత అది కూడా లేకుండా పోయిందని తెలిపారు. అదే గోవాలో పరిస్థితి ఏంటీ? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని, దీనిబట్టీ బీజేపీకి ఎవరు ఏ టీమో, బీ టీమో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. కేసీఆర్ తమ పార్టీతో చర్చించారనీ, టీఆర్ఎస్కు వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. బీజేపీని ఓడించేందుకు తాము సహకరిస్తున్నామన్నారు.