Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభం కానున్న బిడ్ల ఆహ్వాన ప్రక్రియ
న్యూఢిల్లీ : త్వరలో ఐడీబీఐ ప్రయివేటీకరణ కానుంది. అందుకు అనుగుణంగా ప్రాథమిక బిడ్లు ఆహ్వాన ప్రక్రియ ప్రారంభించేందుకు డిపార్టమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) నిర్ణయించింది. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంక్‌లో తన వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ఆసక్తి గల వారి అభిప్రాయాలను తీసుకుంటుందనీ, త్వరలో ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణ కోసం పెట్టుబడిదారుల నుంచి ప్రాథమిక బిడ్లను ఆహ్వానిస్తామనీ, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఇటీవలి ఒక సమావేశంలో తెలిపారు. ఐడీబీఐలో వాటాను విక్రయిస్తామని ప్రభుత్వం 2016 బడ్జెట్లో ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంక్ మే 2017 నుంచి మార్చి 2021 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీఏసీ) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంది. బ్యాంక్ ఫ్రేమ్‌వర్క్ నుంచి నిష్క్రమించిన రెండు నెలల తరువాత మే 2021లో ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ నియంత్రణ బదిలీకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం, ఐడీబీఐలో ప్రభుత్వ వాటా 45.48 శాతం. ప్రస్తుతం బ్యాంక్ ప్రమోటర్‌గా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వాటా 49.24 శాతం. ప్రారంభ బిడ్లను కోరే ముందు ప్రభుత్వం, ఎల్ఐసీతో పాటు ఐడీబీఐ బ్యాంక్‌లో విక్రయించే వాటా పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. ప్రభుత్వం 2022-23 (ఏప్రిల్-మార్చి)లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పటికే రూ. 24,544 కోట్లను సంపాదించింది. వీటిలో ఎక్కువ భాగం ఈ ఏడాది మేలో దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీని జాబితా నుంచి సేకరించింది. ఎల్ఐసీ షేర్లు రూ. 865 తగ్గింపుతో ఒక్కో షేరుకు రూ. 949 ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ధరకు ఇవ్వబడ్డాయి. అప్పటి నుంచి, ఇది ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడవుతోంది. ఎల్ఐసీ షేరు బుధవారం 1.04 శాతం క్షీణించి రూ.663.20 వద్ద ముగిసింది.బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఐడీబీఐ, ఎన్ఎండీసీ, నాగర్నార్ స్టీల్ ప్లాంట్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్తో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఈఎంఎల్ వంటి సంస్థల భూ ఆస్తులను డీమెర్ చేయడం వల్ల వాటి పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.