Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచన
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఇతర దేశాల కళాశాలల్లో తమ చదువు కొనసాగించడానికి అవకాశం కల్పించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కళాశాల ఫీజులు, అందుబాటులో ఉన్న సీట్లు వంటి నిర్దిష్ట అవసరాలను పేర్కొనే ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. పోర్టల్‌ని అభివృద్ధి చేసి.. బదిలీ ఆఫ్షన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలని సూచించింది. 20 వేల మంది విద్యార్థులకు దేశంలో కొనసాగించే పరిస్థితి లేనందున, అక్కడి భాష, సిలబస్ అన్ని సరిపోయేలా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విద్యార్ధులంతా దేశం వెలుపలే చదువుకోవాల్సి ఉన్నందున ప్రస్తుత విద్యా సంవత్సరం కోల్పోకుండా, చదివే సిలబస్‌లో మార్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ధర్మాసనం పేర్కొంది. అందుకని వారి కోర్సును అభ్యసించగలిగేలా... పారదర్శకతతో వివరాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ధర్మాసనం తెలిపింది. విద్యార్ధులు చుట్టుపక్కల దేశాలకు వెళ్లి కళాశాలలు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా కేంద్రం చర్యలు తీసుకుంటే మంచిదని సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. విద్యార్థుల తరపున వాదనల సందర్భంగా... విద్యా సంవత్సరం కోల్పోకుండా, ఆయా దేశాలతో చర్చలు జరిపి తగిన చర్యలు కేంద్రమే చేపట్టేలా చూడాలని ధర్మాసనాన్ని న్యాయవాదులు మోహన్‌రావు, రమేష్ కోరారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను యుద్ధ బాధితులుగా ప్రకటించాలని న్యాయవాదులు కోరారు. అది సైనిక పరమైన అంశాల్లోనే సాధ్యమవుతుందని ధర్మాసనం పేర్కొంది. విద్యార్థులకు సంబంధించి కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించించింది. తగిన చర్యలతో వస్తారని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారం చేపట్టనుంది.