Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాంఘై సహకార సదస్సులో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించవచ్చని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధాని మోడీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో 22వ షాంఘై సహకార సదస్సు (ఎస్సీఓ) లో శుక్రవారం మోడీ సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయనీ, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధన సంక్షోభం ఏర్పడిందన్నారు. ఈ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు అనుసంధానతను సాధించేందుకు మెరుగైన సరఫరా కలిగి ఉండాలని సూచించారు. సభ్య దేశాల మధ్య సహకారానికి, పరస్పర విశ్వాసానికి భారత్ మద్దతునిస్తుందని అన్నారు.ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా, చౌకగా లభించే చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు భారత్ కృషి చేస్తోందని అన్నారు. సాంప్రదాయక వైద్యంలోనూ సభ్య దేశాలు సహకరించాలని కోరారు. ప్రజాభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న వినియోగంపై దృష్టి సారించామనీ, ఎస్సీఓ దేశాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని అంచనావేస్తున్నామని, ప్రపంచ ఆర్థికవ్యవస్థలలో ప్రధానంగా నిలుస్తుందని అన్నారు.ప్రజల కేంద్రంగా అభివృద్ధి విధానాన్ని అమలు చేయడంపై తాము దృష్టి పెట్టామని తెలిపారు.