Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా :సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పిలుపు
న్యూఢిల్లీ : హిందూత్వ మతోన్మాదాన్ని ఓడించేందుకు గానూ లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విస్తృత సమీకరణ అవశ్యమని ఇందు కోసం కృషి చేయాల్సి వుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. అలాగే భారత రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 24వరకు ప్రచారోద్యమాన్నినిర్వహించాల్సిందిగా పిలుపునిచ్చిం ది. పొలిట్‌బ్యూరో ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
హిందూత్వ మతోన్మాదాన్ని ఓడించేందుకు..
స్వతంత్ర బలాన్ని పెంచుకోవడానికి, వామపక్షాల ఐక్యతను బలోపేతం చేయడానికి, వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల మధ్య ఐక్యత కోసం పార్టీ కృషి చేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. భారత రాజ్యాంగానికి రక్షణగా, ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కులు, ప్రజల పౌర స్వేచ్ఛా హక్కులు, భారత రిపబ్లిక్ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించేందుకు గానూ లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను ఒక తాటి పైకి తీసుకువచ్చేందుకు జరిగే కృషిలో సిపిఎం కలిసి పని చేస్తుంది.
ఆర్థిక మాంద్యం
మోడీ ప్రభుత్వం జోరుగా ప్రచారం సాగిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకే ప్రయాణిస్తోంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ 2023 ఆర్థిక సంవత్సరానికి భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలను 7.8 నుండి 7శాతానికి కుదించింది. 2020, 2021, 2022ల్లో భారతదేశ వార్షిక వృద్ధి వాస్తవిక ప్రమాణాల దృష్ట్యా చూసినట్లైతే కేవలం 0.8శాతంగానే వుందని ప్రపంచ బ్యాంక్ డేటా పేర్కొంటోంది. పెరుగుతున్న ఆహార పదార్ధాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం కూడా పరుగులు తీస్తూ వరుసగా 8వ నెల్లో కూడా ఆర్బిఐ సీలింగ్ 6 శాతాన్ని దాటేసింది. ఆగస్టు మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు శాతానికి పెరిగింది. ఆహార ధరల పెరుగుదల 7.62శాతం దాటింది. ద్రవ్యోల్బణం 7.15శాతాన్ని చేరుకోవడంతో గ్రామీణ భారతంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అదే సమయంలో, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు జూన్‌లో 12.7శాతంగా వుండగా, జులై నాటికి 2.4శాతానికి పడిపోయింది. వినిమయదారుల వస్తూత్పత్తి జూన్‌లో కన్నా 3శాతం తక్కువగా వుంది.
ఫలితంగా నిరుద్యోగంలో పెరుగుదలతో దేశంలో ఉపాధి పరిస్థితి దయనీయంగా తయారైంది. 2021లో చోటు చేసుకున్న ఆత్మహత్యల్లో అధికంగా వున్నది రోజువారీ వేతన కూలీలేనని ఇప్పటికే జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) పేర్కొంది.
సెప్టెంబరు ప్రచారోద్యమం
ప్రజల జీవనోపాధులపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కులు, లౌకికవాదం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు సెప్టెంబరు 14నుండి 24 వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభలు, ర్యాలీలతో ఈ ప్రచారోద్యమాన్ని ముగించాలని కోరింది. సంపన్నులకు పన్ను రాయితీలను, ఆశ్రితులకు పెద్దమొత్తంలో రుణాల రద్దును తక్షణమే నిలిపివేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఈ వనరులన్నింటినీ ఉపాధి కల్పనా కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడులను పెంచేందుకు ఉపయోగించాలని కోరింది.
మహిళలపై హింస
2021లో మహిళలపై అత్యాచారాలు 15శాతానికి పైగా పెరగడం పట్ల పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో ఆయా కేసుల్లో దోషులను నిర్ధారించడం చాలా తక్కువగా వుంటోదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇద్దరు దళిత మైనరు బాలికలపై సామూహిక లైంగికదాడి, హత్యకు పాల్పడిన దారుణ ఘటన ఆ రాష్ట్రంలో మహిళల భద్రత కుప్పకూలిన ధోరణిని ప్రతిబింబిస్తోంది.
హైదరాబాద్ -
చరిత్రను మళ్ళీ వక్రీకరిస్తున్న బీజేపీ
1948 సెప్టెంబరు 17 హైదరాబాద్ నిజాం లొంగిపోయాడు, పూర్వపు నిజాం రాష్ట్రం భారత యూనియన్‌లో భాగమైంది. ఈ రోజును విమోచన దినంగా ప్రకటించి, ఏడాది మొత్తంగా దీన్ని పాటించాలని బీజేపీ ప్రకటించింది. ముస్లిం పాలన నుండి 'విముక్తి'గా పేర్కొనడం ద్వారా మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలన్నది బీజేపీ లక్ష్యంగా వుందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగా చరిత్రను వక్రీకరిస్తూ, తిరిగి రాయాలని చూస్తోంది.
1946లో క్రూరమైన భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించిన సాయుధ పోరాటం తర్వాత నిజాం పాలన భరించలేనిదిగా మారింది. దీనితో నిజాం నిరంకుశ పాలన గణనీయంగా బలహీనపడింది. 1948 సెప్టెంబరు 13న పోలీసు చర్యను ప్రారంభించారు. ఆ చర్య, అంతిమంగా 1948 సెప్టెంబరు 17న లొంగిపోవడానికి దారి తీసింది. ఈ 'విముక్తి' కి ఘనతను ఆపాదించుకోవడానికి ఆర్ఎస్ఎస్ చేసే ప్రయత్నం హాస్యాస్పదం. మహాత్మాగాంధీ హత్య తర్వాత సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. 1948 ఫిబ్రవరి 4 నుండి 1949 జులై 11వరకు ఈ నిషేధం అమల్లో వుంది. నిజాం లొంగిపోయేలా ఒత్తిడి తీసుకురా వడంలో తన పాత్ర వుందని బిజెపి చెప్పుకోవడం కేవలం ప్రహసనం తప్ప మరొకటి కాదు.
సాయుధ పోరాటం యొక్క అద్భుతమైన చరిత్రను, అసంఖ్యాక అమరవీరులను గుర్తు చేసుకునే దినంగా, ఫ్యూడల్ బానిసత్వం నుండి లక్షలాది మంది రైతాంగానికి విముక్తి కల్పించిన రోజుగా సీపీఐ(ఎం) ఈ రోజును పాటిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చోటు చేసుకున్న రైతాంగ తిరుగుబాటుతో పాటు ఈ చారిత్రక సాయుధ పోరాటం భూ సంస్కరణలను స్వతంత్ర భారత దేశ ప్రధాన ఎజెండాగా మందుకు తెచ్చింది.
కేంద్ర కమిటీ సమావేశం
అక్టోబరు 29-31 తేదీల్లో ఢిల్లీలో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరుగనుంది.