Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు
న్యూఢిల్లీ : గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) అమల్లోకి తీసుకురావాలని వారంతా అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ టీచర్లు, పంచాయితీ, ఆరోగ్య శాఖల కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు శనివారం 'సామూహిక సెలవు' ఆందోళన చేపట్టారు. రాజధాని గాంధీనగర్లో జరిగిన నిరసన ర్యాలీలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులంతా సామూహిక సెలవు ఆందోళనకు దిగారని జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 2005 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి గుజరాత్లో పాత పెన్షన్ పథకం అమలుకావటం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగుల్లో 99శాతం 2005 తర్వాత చేరినవారేనని ఉద్యోగసంఘాల నాయకులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు, ఐదుగురు మంత్రుల బృందం మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి. ఓపీఎస్ మినహా మిగతా డిమాండ్లను నెరవేర్చడానికి మంత్రుల బృందం సుముఖత వ్యక్తం చేసినట్టు 'రాష్ట్రీయ సంయుక్త మోర్చా' అధ్యక్షుడు భీకాభారు పటేల్ తెలిపారు. ఏప్రిల్, 2005కు ముందు ఉద్యోగాల్లో చేరినవారికే సాధారణ ప్రావిడెంట్ ఫండ్, పాత పెన్షన్ పథకం అమలవుతుందని శుక్రవారం రాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులు, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా లేదని, ముఖ్యంగా పాత పెన్షన్ పథకం విషయంలో ప్రభుత్వ వైఖరి వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రీయ సంయుక్త మోర్చా కన్వీనర్ మహేష్ మోరీ మాట్లాడుతూ..''ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్ ఓపీఎస్ అమల్లోకి తేవటం. శుక్రవారం జరిగిన చర్చల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. ఓపీఎస్ అనేది ప్రతి ఉద్యోగిని ప్రభావితం చేసే అంశం. ఏదేమైనా ఈ విషయంలో రాజీపడరాదని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. దాంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా సెలవులు తీసుకున్నారు. తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు'' అని అన్నారు. ఒక్క భావ్నగర్ జిల్లాలో శనివారం సుమారుగా 7వేలమంది టీచర్లు సామూహిక సెలవు ఆందోళన చేపట్టారు. ఓపీఎస్ తీసుకురావాలని టీచర్లు, పంచాయితీ, ఆరోగ్య శాఖల కార్మికులు, ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు గతకొంత కాలంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.