Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక విపత్తుకు దారి తీస్తుంది
- ఆర్థిక నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశంలో మోడీ పాలనలో బ్యాంకింగ్ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు రుణాలు ఎగ్గొట్టి దేశాన్ని విడిచి పెట్టిపోవటంతో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) గుట్టలుగా పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలు ఈ రంగాన్ని కుదేలు చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు అన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ రంగం బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న ప్రయత్నాలను కేంద్రం ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందుకు అంది వచ్చిన ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవటం లేదు. ఈ ప్రయివేటీకరణపై ఆర్థికవేత్తలు, నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రయివేటీకరణతో ఆర్థిక విపత్తుకు దారి తీస్తుందని వారు హెచ్చరించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొన్నింటినైనా ప్రయి వేటీకరించాలన్న ప్రభుత్వ యోచనపై ప్రాథమిక అభ్యంతరాలున్నాయి. అయితే, మోడీ సర్కారు మాత్రం దేశ భవిష్యత్తును విస్మరిస్తున్నదని ఆర్థిక విశ్లేషకులు చెప్పారు. దేశీయ, విదేశీ బడా వ్యాపా రులను ఆహ్లాదపర్చటానికి ఎక్కువగా శ్రద్ధ వహిస్తు న్నదన్నారు. బ్యాంకులు తమ వనరులను ప్రజల డిపాజిట్ల నుంచి పొందుతాయి. వీటిని ప్రజలు క్షణం నోటీసులో విత్డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ వనరులలో గణనీయమైన భాగాన్ని దీర్ఘకాలిక పెట్టుబడి కోసం రుణాలు ఇవ్వటానికి ఉపయోగిం చటంతో బ్యాంకులు తీవ్ర నష్టాన్ని ఎదురు చూస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, బ్యాంకులు ఇంకా తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కోకపోవటానికి కారణం.. అవి ప్రభుత్వ ఆధీనంలో ఉండటమేనని అన్నారు. ప్రభుత్వాధీనంలో ఉన్న కారణంగానే డిపాజిటర్లు కొంత నమ్మకంతో ఉండగలుగుతున్నారని నిపుణులు చెప్పారు. బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కొంటే వాటి బాధ్యత తమదేనని ప్రభుత్వం గుర్తెరుగు తుందన్నారు. ఈ విశ్వాసం కచ్చితంగా బ్యాంకులను సంక్షోభాన్ని ఎదుర్కోకుండా నిరోధిస్తుందని చెప్పారు. అయితే, ప్రయివేటీకరణ విధానాలతో మాత్రం పరిస్థితులు మరింత కఠినంగా తయారవుతాయనీ, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి తీసుకెళ్తాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి నిర్ణయం నుంచి మోడీ సర్కారు వెనక్కి తగ్గాలని సూచించారు.