Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి వైఖరి తీసుకోవాలి:
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్
న్యూఢిల్లీ : దేశంలో బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ఎజెండాను అమలు చేస్తున్నారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శిం చారు. ప్రతిరోజూ కేరళ ప్రభుత్వ, యూనివర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న గవర్నర్ మహమ్మద్ ఆరీఫ్ ఖాన్ చర్యలను ప్రకాష్ కరత్ ఖండించారు. ఈ మేరకు శనివారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో మీడియాతో మాట్లాడారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలు దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, కన్నూర్ యూనివర్సిటీ వంటి సంస్థలపై రోజూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ఛాన్సలర్ పదవిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, యూనివర్సిటీ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతున్నారో దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. ఇది కేరళలో మాత్రమే జరిగే వ్యవహారం కాదనీ, బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గత మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీ నియమించిన గవర్నర్లు ఛాన్సలర్ల హౌదాను దుర్వినియోగం చేస్తూ యూని వర్సిటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడే కేరళ గవర్నర్ నిజానికి ఏకపక్షంగా, అనవసరమైన జోక్యాలు చేస్తూ యూనివర్సిటీ స్వయంప్రతిపత్తిని కాలరాస్తు న్నారని దుయ్యబట్టారు. కేరళ ప్రభుత్వం, కేరళ శాసనసభ విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియామకాల పద్ధతిలో కొన్ని మార్పులు తీసుకురావడానికి చట్టాన్ని తీసుకొచ్చాయని అన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి చట్టాలు వచ్చాయని గుర్తు చేశారు. గవర్నర్లు రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అనవసర విషయాల్లో తలదూర్చకూడదని హితవు పలికారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న గవర్నర్లల్లో కేరళ గవర్నరే ఒక్కరే కాదని, తమిళనాడు గవర్నర్ కూడా ఉన్నారని అన్నారు. అక్కడ అసెంబ్లీ ఆమోదించిన చాలా బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించకుండా, నిబంధనలు తుంగలో తొక్కి వైస్ చాన్సలర్లను నియమిస్తున్నారని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు చాలా ముఖ్యమైన అంశమని, గవర్నర్ల పాత్ర కీలకమని అన్నారు. అయితే గవర్నర్లు బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఒక వేదికపైకి రావాలనీ, గవర్నర్ల పాత్రపై ఉమ్మడి వైఖరిని తీసుకోవాలని సూచించారు.