Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడవారిదే తప్పంటూ వ్యాఖ్యలు
- లఖింపూర్ ఖేరీ దారుణ ఘటనపైనా అదే తీరు
- వెనుకేసుకొస్తున్న కాషాయ పార్టీ : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్
న్యూఢిల్లీ : దేశంలోని మోడీ పాలనలో మహిళలకు భద్రత కరువవటంతో వారిపై జరుగుతున్న దారుణాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, లైంగికదాడులు అధికమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కానీ, అక్కడి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించటం లేదు. దీనికి తోడు బాధితురాళ్లకు అండగా నిలవాల్సిన సమయంలో అధికార బీజేపీ నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. తప్పంతా బాధిత మహిళలదే అన్నవిధంగా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్న వారి పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు మైనర్ దళిత బాలికపై దారుణమైన లైంగికదాడి, హత్య జరిగిన విషయంలో ఒక జాతీయ వార్త ఛానెల్ నిర్వహించిన చర్చలో బీజేపీ నాయకుడు అశోక్ వత్స్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. బాధిత అమ్మాయిలే ఈ అఘాయిత్యం జరగటానికి కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బృందాకరత్ తప్పుబట్టారు. ఇది అసహ్యకరమైన ప్రకటనగా పేర్కొన్నారు. లైంగిక వేధింపుల బాధితుల గురించి బీజేపీ నేతలు ఈ విధంగా మాట్లాడటం సాధారణమేనని వివరించారు. ''హత్రాస్‌లో యువతిపై క్రూరమైన సామూహిక లైంగికదాడి, హత్య జరిగిన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకునేంత వరకూ కేసు నమోదు కాలేదు. బీజేపీ నాయకుడు రాజీవ్ శ్రీవాస్తవ.. బాధితురాలిని 'ఆవారా' అనీ, నిందితులు అమాయకులు అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రకటనపై జాతీయ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులను సైతం జారీ చేసింది. అయితే ఎలాంటి చర్య తీసుకోలేదు. చాలా కాలం క్రితం, కర్నాటకలోని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్యా మాట్లాడుతూ.. మహిళలు ధరించే కొన్ని దుస్తులు పురుషులను ప్రేరేపిస్తాయి. మహిళలు నిరాడంబరంగా దుస్తులు ధరించాలన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమపై జరిగే నేరాలకు మహిళలే బాధ్యులు. దేశాన్ని పాలించే పార్టీలో ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తులు ముఖ్యమైన పదవులను కలిగి ఉండటం దారుణం.
కానీ, లఖింపూర్‌ఖేరీలో లాగా మైనర్లకు సంబంధించిన కేసుల్లో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమైన పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు మహిళలపై అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ పార్టీ నాయకత్వం వారిపై ఎలాంటి చర్యలకూ దిగలేదు. పైగా వారు రక్షించబడ్డారు. కాగా, ఈ కేసులో చట్టంలోనిసరైన క్లాజులతో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కష్టపడటం అన్యాయం. ఇది యూపీలో మహిళలపై నేరాలు జరుగుతును పరిస్థితులకు అద్ధం పడుతున్నది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 56,093 కేసులతో, దళితులు, మహిళలపై అత్యధిక నేరాలతో దేశంలో యూపీ అగ్రస్థానంలో ఉనుది. దేశంలో దళితులపై జరుగుతున్న నేరాల్లో యుపి 26 శాతం, రాజస్థాన్ (14.7 శాతం), ఎంపీ (14.1 శాతం) ఉన్నాయి. సామూహిక లైంగికదాడి, హత్య కేసులు 218 ఉన్నాయి. ఈ విభాగంలోనూ 48 నేరాలతో యూపీ అగ్రస్థానంలో ఉన్నది. మహిళలు, ముఖ్యంగా దళిత స్త్రీలకు భద్రత లేని రాష్ట్రం యూపీ అని న్యాయబద్ధమైన అభియోగం ఉన్నది.
దీనికి ప్రతిగా, నిందితులు ముస్లింలు అయినందున ఈ కేసును మతతత్వానికి గురి చేయటానికి ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు, అధికార పార్టీలో ప్రమాదకరమైన ప్రయత్నం జరుగుతున్నది. ఇక బిల్కిస్ బానో సామూహిక లైంగికదాడి కేసులో 11 మంది దోషులు విడుదలైన తర్వాత వారికి మిఠాయిలతో స్వాగతం పలికారు. 2014 లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాని డీఎన్ఏలో స్త్రీ ద్వేషి, కుల, మతతత్వ భావజాలాన్ని ప్రోత్సహించటం చూశాం. నేరస్థుల కులం, మతం కారణంగా అత్యంత ఘోరమైన నేరాలకు శిక్ష తగ్గుతుంది. లఖింపూర్ ఖేరీ లైంగికదాడి, హత్య కేసులో నేరస్థులు అత్యంత కఠినమైన శిక్షలకు అర్హులు. బాధిత కుటుంబానికి యూపీ ప్రభుత్వం అన్ని రకాల సహాయాన్ని అందించాలి'' అని బృందాకరత్ వివరించారు.