Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
- ద్విజాతి సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ బలపరిచింది
- వామపక్ష ప్రభుత్వాలతోనే సమతుల్య అభివృద్ధి
అనంతపురం : కార్పొరే టీకరణ, కాషాయీకరణే బీజేపీ విధానమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. కర్నాటకలోని బాగేపల్లిలో సీపీఐ(ఎం) కర్నాటక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దేశరక్షణ భేరిలో భాగంగా ఆదివారం బహిరంగ సభ జరిగింది. సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. అంతకుముందు పట్టణంలో నిర్వహించిన భారీ ప్రదర్శనతో బాగేపల్లి ఎరుపె క్కింది. ఎర్రజెండాలు చేతబూని వేలాదిమంది జనం పట్టణంలో ప్రదర్శనలో పాల్గనడంతో ప్రధాన వీధిలో మొత్తం కిలోమీటరు వరకుపైగా ఎరుపెక్కింది. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఎంఎ.బేబి పాల్గొన్నారు. బహిరంగ సభలో పినరయి విజయన్ ముఖ్య ఉపన్యాసం చేశారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశం ఆధోగతి పాలైందన్నారు. నిరుద్యోగం ఎప్పుడూలేనివిధంగా తారా స్థాయికి చేరిందనితెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే తదితర రంగాల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటినిభర్తీ చేయడం లేదన్నారు. మరోవైపు ప్రజా సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సామాన్యుల ఆదాయం పడిపోతుంటే కార్పొరేట్ సంస్థల ఆదాయం విపరీతంగా పెరుగుతోందన్నారు. ధనిక, పేదల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరంగా చేస్తోందని విమర్శించారు. కర్నాటకలోనే విద్యా సంస్థల్లో హిజాబ్ పేరుతో ఏ రకంగా విద్వేషాన్ని నింపేందుకు ప్రయత్నించిందో చూశామని గుర్తు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలుపెంచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బ్రిటిష్ హయాంలో ద్విజాతి సిద్ధాంతాన్ని మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదిస్తే దాన్ని ఆర్ఎస్ఎస్ బలపరిచిందని గుర్తు చేశారు. కాంగ్రెసు కూడా దీనికి భిన్నంగా లేదని విమర్శించారు. కేరళలో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తుంటే, గోవాలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారన్నారు. బీజేపీకి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా కాంగ్రెసు మారిందని ఎద్దేవా చేశారు. వామపక్ష ప్రభుత్వాలతోనే సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశంలో కేరళ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉందని తెలిపారు. మానవాభివృద్ధి, ఆరోగ్యం తదితర రంగాల్లో ముందుందని వివరించారు. కేరళలోనివామపక్ష ప్రభుత్వంపై కాంగ్రెసు, బీజేపీ కలగలసి దుష్ప్రచారం చేశాయన్నారు. అయినా, గత ఎన్నికల్లో కేరళ ప్రజలు వామపక్ష ప్రభుత్వానికి మరింత బలాన్ని ఇచ్చారని తెలిపారు.
బివి.రాఘవులు మాట్లాడుతూ కర్నాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అభివద్ధి చేస్తామని ఇక్కడి బీజేపీ ప్రభుత్వం చెబుతోందన్నారు. అయితే, ఈ డబుల్ ఇంజిన్ పనిచేయడం లేదని, తప్పుబట్టిందని తెలిపారు. దీన్ని భూమిపై ఏ మాత్రమూ ఉంచేందుకు వీల్లేదని, బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. మరోమారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటికీ కోత పెట్టడం ఖాయమన్నారు. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలన్నింటికీ మూడు లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయని, అది భారమని కేంద్రం చెబుతోందని పేర్కొన్నారు. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు రూ.15 లక్షల కోట్లు రాయితీలిస్తోందని తెలిపారు.