Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2012-16లో వేతనాల్లో సగటు వృద్ధి 8.2శాతం..
- 2017-21నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి 2.8శాతం
- ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే వృద్ధి గణాంకాలు మైనస్‌లోకి..
- ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఏర్పడకపోవడానికి ఇదే ప్రధాన కారణం
- కుటుంబ ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలి : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధించిందని...ఇది మామూలు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఇంకా ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో కుటుంబ సగటు ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని, దీనివల్లే ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడటం లేదని ఇటీవల ఒక రేటింగ్ సంస్థ వెల్లడించింది. పెరిగిన ద్రవ్యోల్బణం కూడా లెక్కలోకి తీసుకుంటే సగటు వేతనాల్లో వృద్ధి మైనస్ 3.7శాతం (గ్రామీణప్రాంతాల్లో), మైనస్ 1.6శాతం (పట్టణాల్లో) వద్దకు చేరుకున్నాయని రేటింగ్ సంస్థ నివేదిక పేర్కొన్నది. 2012-16లో భారత్‌లో కుటుంబ సగటు వేతనాల్లో వృద్ధి 8.2శాతం కాగా, ఇది 2017-21నాటికి 5.7శాతానికి పడిపోయింది. సవరించిన ద్రవ్యోల్బణం కూడా పరిగణలోకి తీసుకుంటే కుటుంబాల సగటు వేతనాల్లో వృద్ధి మైనస్‌లోకి జారుకుందని నివేదిక తెలిపింది. ఓ వైపు వాస్తవ గణాంకాలు ఈ విధంగా ఉంటే, భారత్ ఆర్థికంగా వెలిగిపోతోందని ప్రధాని మోడీ సర్కార్ ప్రచారానికి తెరలేపింది.
ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఏర్పడాలంటే, ఉపాధిరంగం మెరుగుపడాలి. ఇది జరగాలంటే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కీలకమైన చర్యలు చేపట్టాలి. అదేమీ చేయకుండా కేవలం దేశంలోని అత్యంత ధనవంతులకు, బడా కార్పొరేట్లకు మరిన్ని లక్షల కోట్లు రుణాలు అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్ పన్ను మినహాయింపులు కొనసాగిస్తోంది. కోవిడ్ తర్వాత మరిన్ని పన్ను ప్రయోజనాలు ప్రకటించింది. కేంద్రం ఇచ్చినవన్నీ పూర్తిగా వాడుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడుల వ్యయాన్ని పక్కకు పెట్టాయి. నడుస్తున్న ప్రాజెక్టులను సైతం ఆపేస్తున్నాయి. వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి. ఉదాహరణకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేలకోట్లు రూపాయలు రుణాలుగా తీసుకున్న 'బిగ్' సూపర్ మార్కెట్ అధినేత నేడు దివాలా ప్రకటించాడు. అందులో పనిచేసే ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు. నగరాలు, పట్టణాల్లో ప్రయివేటు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
బయటపడటం ఎలా?
అత్యంత ధనవంతులు, కార్పొరేట్లకు రుణాలు, పన్ను ప్రయోజనాలు కల్పించటమనే విధానాన్ని కేంద్రం విడనాడాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలూ చేయదని చెబుతున్నారు. పరిశ్రమల్లో అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.26వేలకు పెంచాలని, ద్రవ్యోల్బణంతో ముడిపడిన కరువుభత్యం అందించాలని సూచిస్తున్నారు. సెమీ-స్కిల్డ్, స్కిల్డ్ కార్మికులు, ఇతర ఉద్యోగుల వేతనాలూ తదనుగుణంగా పెంచటం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌కు దారితీస్తుందన్నారు. వ్యవసాయ కార్మికుల కోసం న్యాయమైన కనీస వేతనం, ఇతర ప్రయోజనాలతో కూడిన సమగ్ర చట్టం తీసుకురావటం విప్లవాత్మక మార్పుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారి వేతనాల్లో పెరుగుదల అపారమైన కొనుగోలు శక్తిగా బదిలీ అవుతుందని అంటున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్సీ)కు చట్టబద్ధమైన హామీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుజేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.