Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 మందితో జాతీయ కమిటీ ఎన్నిక
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పిపి ప్రేమ, మధుమితా బెనర్జీ
- తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి నలుగురికి అవకాశం
న్యూఢిల్లీ : ఆశా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత స్థాయిలో ఆశా వర్కర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ) ఏర్పాడింది. హర్యానాలోని కురుక్షేత్రలో రంజన నీరులా నగర్ (సాయినీ సమాజ్ భవన్)లో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ మహాసభ ఆదివారం ముగిసింది. ఇందులో 17 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 286 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరయ్యారు. ఈ మహాసభలో వందలాది మంది ఆశా కార్మికుల నినాదాల మధ్య జాతీయ స్థాయిలో మొట్టమొదటి సంఘాన్ని ఆశా వర్కర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ) ఏర్పాటుచేశారు. 45 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పిపి ప్రేమ, ప్రధాన కార్యదర్శిగా మధుమితా బెనర్జీ, కోశాధికారిగా పుష్పాపాటిల్లు ఎన్నికయ్యారు. కమిటీకి తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి నలుగురు ఎన్నికయ్యారు. ఏపీ నుంచి ఉపాధ్యక్షురాలిగా కె. ధనలక్ష్మీ, కార్యదర్శిగా కె. పోసమ్మ, సభ్యురాలుగా ఎ.కమల, ఎం.వాణిశ్రీ ఎన్నికయ్యారు. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర మహాసభ జరగకపోవడంతో ఒక ఆఫీస్ బేరర్, ఒక కమిటీ సభ్యులు స్థానాలు కో-ఆప్షన్లో పెట్టారు. కనీస వేతనాలు, పెన్షన్, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం పోరాటాలను ఉధృతం చేయాలని కన్వెన్షన్ పిలుపు నిచ్చింది. మహాసభను సీఐటీయు జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత ప్రారంభించారు.
ప్రతినిధి సభలో ముసాయిదా నివేదికను సురేఖ, మధుమిత బెనర్జీ, ఏఆర్ సింధు మూడు భాగాలుగా ప్రవేశపెట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 37 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొని, డిమాండ్లు, భవిష్యత్తు కార్యాచరణ చార్టర్లో తమ సూచనలు, సవరణలను అందించారు. నివేదికపై మధుమితా బెనర్జీ సమాధానం ఇచ్చారు. అనంతరం నివేదిక ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ మహాసభ అన్ని రాష్ట్రాల్లోని అనుబంధ సంఘాల పనితీరును అనుసంధానం చేసి నియంత్రించే ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐకు సంబంధించిన రాజ్యాంగాన్ని కూడా ఆమోదించింది. దీనిని వీణా గుప్తా ప్రవేశపెట్టిన పెట్టారు. మహాసభ మతతత్వానికి వ్యతిరేకంగా, మానవ హక్కుల, భావప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కోసం రెండు తీర్మానాలను ఆమోదించింది. సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధూ ముగింపు ప్రసంగం చేశారు. 2009లో ఏర్పడిన ఆశా వర్కర్ల ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ దేశంలో ఆశా వర్కర్ల ఉద్యమాన్ని నిర్మించి, 20 రాష్ట్రాలకు విస్తరించిందనీ, ఏడబ్ల్యూఎఫ్ఎఫ్ఐ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తలను సమీకరించే బాధ్యతను తీసుకుంటుందని తెలిపారు.