Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కునో నేషనల్ పార్క్ చుట్టుపక్కల గ్రామస్థుల ఆందోళనలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల ప్రవేశం దాని చుట్టుపక్కన గ్రామాల్లో ఉన్న ప్రజల్లో కొత్త భయాల్ని కలిగిస్తున్నది. చీతాల సంచారంతో పాటు భూ సేకరణపై షియోపూర్ జిల్లాలోని సదరు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అంతరించిపోయిన చీతాలను నమీబియా దేశం నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం విదితమే. వీటిని ప్రధాని మోడీ ఈనెల 17న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో క్వారంటైన్ ఎన్‌క్లోజర్ నుంచి వదిలారు. ''పార్క్ కోసం ఇక్కడున్న మిగిలిన నాలుగైదు గ్రామాలనూ ఇక్కడి నుంచి తరలిస్తే నాకున్న చిన్న ఫుడ్ కోర్టు ఏమవుతుంది? గత 15 ఏండ్లుగా కునో పార్క్ కోసం 25 గ్రామాలను తరలించటంతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయాం'' అని షియోపూర్-శివపురీ రోడ్డు మీద టీ,స్నాక్స్ అమ్మే వ్యక్తి రాధేశ్యామ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గరలో నిర్మించే డ్యామ్ ప్రాజెక్టుతో సేసారుపుర ప్రజలు తమ జీవనాధారాన్ని కోల్పోతారని రామ్‌కుమార్ గుర్జార్ అనే రైతు వాపోయాడు. '' అంతకముందు కునో నేషనల్ పార్క్ కోసం గ్రామాలను తరలించారు. ఇప్పుడు కటిలా ప్రాంతంలో కునో నదిపై డ్యామ్ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు సెసారుపురను కలిపే దాదాపు 50 గ్రామాలపై ప్రభావాన్ని చూపెడుతుంది'' అని గుర్జార్ తెలిపాడు. చీతాల రాకతో పర్యాటకులు రావటం పక్కనుంచితే ఇక్కడకు స్థానికేతర సంపన్నులు వచ్చి హోటళ్లు, రెస్టారెంట్లు పెట్టి వారే లబ్ది పొందుతారనీ, స్థానికులకు వాటిలో దక్కేది చిన్నా చితకా ఉద్యోగాలేనని వాపోయాడు. పార్క్‌లో వదిలిన చీతాలు తమ గ్రామాల్లోకి ప్రవేశించొచ్చని ధర్మేంద్ర కుమార్ ఓఝా ఆందోళన వ్యక్తం చేశాడు. చీతాల రాకపై కునో నేషనల్ పార్క్ ప్రవేశద్వారానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండే టిక్టోలి గ్రామస్థుడు కైలాశ్ మాట్లాడుతూ.. ''నాకు భవిష్యత్తు ప్రయోజనాల గురించి తెలియదు. చీతాల రాక కారణంగా నాకు భయంగా ఉన్నది. మేము ఎక్కడికి వెళ్లాలి?'' అని ప్రశ్నించాడు. తమ గ్రామానికి నీటి సరఫరా, టెలిఫోన్ నెట్వర్క్, ఉద్యోగావకాశాలు లేవని అదే గ్రామానికి చెందిన కమల్ బాధను వ్యక్తం చేశాడు. వ్యవసాయమే తమకున్న ఏకైక ఆధారమని చెప్పాడు. ఇక మరికొందరు, చీతాల రాకతో పర్యాటకం వృద్ధి చెంది తమకు లాభాన్ని తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.