Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చండీగఢ్ యూనివర్సిటీ యాజమాన్యం
చండీగఢ్ : పలువురు విద్యార్థినుల వీడియోలు లీకయ్యాయన్న వార్తలను చండీగఢ్ యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. అవన్నీ అవాస్తవాలేనని.. ఒక విద్యార్థిని తన సొంత వీడియోను హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి షేర్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. ఆ విద్యార్థినిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు మొహాలీ సీనియర్ ఎస్పీ వివేక్ శీల్ సోనీ వెల్లడించారు. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
విద్యార్థినుల వ్యక్తిగత వీడియోలు లీక్ అయినట్టు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు అసత్యమని కొట్టిపారేశారు. ఎవరూ ఆత్మహత్యకు ప్రయత్నించలేదని.. ఎవరూ రూమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక విద్యార్థిని ఆందోళనకు గురై కుప్పకూలగా ఆమెను ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. ఆ నిందితురాలు ఎవరికైతే వీడియో పంపిందో అతడిని కూడా అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బఅందం సిమ్లాకు వెళ్లినట్లు ఎడిజిపి గురుప్రీత్ కౌర్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన తమ దర్యాప్తులో నిందితురాలి ఒక్క వీడియోను మాత్రమే గుర్తించినట్టు చెప్పారు. ఆమె ఇంకెవరి వీడియోలనూ రికార్డు చేయలేదని పోలీసులు స్పష్టంచేశారు. వర్సిటీలో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపనున్నట్లు తెలిపారు.60 మంది విద్యార్థినుల అభ్యంతరకరమైన ఎంఎంఎస్‌లు దొరికినట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చండీగఢ్ విశ్వవిద్యాలయం ప్రో వైస్‌ఛాన్సలర్ డాక్టర్ ఆర్ఎస్ బవా ఒక ప్రకటనలో తెలిపారు. అవిపూర్తిగా అబద్ధమని, నిరాధారమైనవని అన్నారు. ప్రాథమిక విచారణలో ఒక విద్యార్థిని తన స్నేహితునికి షేర్ చేసిన వ్యక్తిగత వీడియో తప్ప ఇతర ఏ వీడియోలను గుర్తించలేదని అన్నారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను పోలీస్ శాఖకు అప్పగించామని, అన్ని మొబైల్ ఫోన్లు, ఇతర మెటీరియల్‌ను పోలీసులకు అందజేశామని ఓ ప్రకటనలో వెల్లడించారు.ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఛైర్పర్సన్ రేఖా శర్మ పంజాబ్ డీజీపీ, చండీగఢ్ వర్సిటీ విసికి లేఖ రాసినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ మనీశా గులాటీ తెలిపారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నామని అన్నారు.
నిందితులపై కఠినచర్యలు : పంజాబ్ సిఎం భగవంత్ మాన్
చండీగఢ్ యూనివర్సిటీ ఘటన బాధాకరమని, మన ఆడపిల్లలు మనందరికీ గర్వకారణమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు.
దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. తప్పుచేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. నిరంతరం అధికారులతో టచ్‌లో ఉంటానని.. ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.