Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మతి లేకుండానే స్టీల్ ప్లాంట్ అమ్మకం
- 'ప్రయివేటు'కు కట్టబెట్టే చర్యల్లో మోడీ సర్కారు
- ఛత్తీస్గఢ్లో ఆదివాసీల ఆగ్రహం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో గిరిజనుల హక్కులను మోడీ ప్రభుత్వం కాల రాస్తున్నది. ప్రజా అవసరాల కోసమంటూ పెద్ద ఎత్తున భూములను సేకరించి రూ. 24వేల కోట్ల విలువ చేసే నగర్నర్ స్టీల్ ప్లాంట్ను బస్తర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) దాదాపు 1980 ఎకరాల భూమిని సేకరించింది. ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రత్యేక రాజ్యాంగ, న్యాయ నిబంధలనలు అనేవి వారి హక్కుల రక్షణ కోసం కల్పించబడ్డాయి. ఇప్పుడు ఈ హక్కులకు మోడీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. వారి హక్కులను పట్టించుకోకుండా స్టీల్ ప్లాంట్లో వాటాల విక్రయానికి తెరలేపింది.
ఇంత పెద్ద ప్రాజెక్టు ఏర్పాటుతో ఆదివాసీలు తీవ్రంగా ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ప్రయివేటీకరించాలని మోడీ సర్కారు భావిస్తున్నది. అయితే, తన వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకోవటానికి ముందు ఇక్కడి ఆదివాసీల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ, కేంద్రం అలా చేయకుండా ప్రయివేటీకరణపై ఏకపక్ష వైఖరితో ముందుకెళ్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సం ముగింపు నాటికి బిడ్లను ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనున్నట్టు తెలుస్తున్నది. అయితే, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి కేంద్రం తమ సమ్మతి కోరకుండా ముందుకు పోవటం ఆమోదనీయం కాదని ఇక్కడి ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మోడీ సర్కారు వెనక్కి తగ్గాలని హెచ్చరించారు. తమ పట్ల మోడీ సర్కారుకు ఎన్నికల సమయంలోనే ప్రేమ ఉంటుందనీ, మిగతా సమయాల్లో కార్పొరేట్లు, బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కేంద్రానికి ముఖ్యమని ఆదివాసీలు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని చెప్పారు.