Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : మహిళా రిజర్వేషన్ల కల్పనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తర భారత దేశం, పార్లమెంట్లు సుముఖంగా లేవని అన్నారు. ఉత్తర భారత దేశం, పార్లమెంట్లు మానసికంగా సంసిద్ధంగా లేవని చెప్పారు. పూణె డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తన కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో ముఖాముఖిలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని అన్నారు.గతంలో తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్ సూచించారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్, పంచాయతీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టామనీ, మొదట ప్రజలు దీనిని వ్యతిరేకించినప్పటికీ.. తర్వాత దానికి ఆమోదం తెలపారని శరద్ పవార్ స్పష్టం చేశారు.