Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం,ఈసీతో సహ తెలంగాణ,ఏపీలకు నోటీసులు
- 29న విచారించనున్న సుప్రీం
- జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపు పై పిటిషన్
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం సహ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.. ఈ అంశాన్ని ఈ నెల 29న మరోసారి సుప్రీం కోర్టు విచారించనున్నది. అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ హృషీకేష్రారులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పటికే జమ్ము కాశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి దాఖలైన మరో పిటిషన్‌కు పురుషోత్తం రెడ్డి పిటిషన్‌ను జతచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపిలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153 వరకు పెంచాల్సి ఉన్నది. అయితే అసెంబ్లీ స్థానాల పెంపు అంశం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26లోని నిబంధన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నిబంధనలకు లోబడి చేయాల్సి ఉన్నది. అందువల్ల 2031 తరువాత జరిగిన మొదటి జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నదని కేంద్రం తెలిపింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగాన్ని ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని అన్నారు. అలా కాకుండా కాశ్మీర్లో సీట్లు పెంపునకు రాజ్యాంగ సవరణ చేయాలని ఆదేశిస్తే, తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు.