Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన త్రిసభ్య ధర్మాసనం
న్యూఢిల్లీ : మరణశిక్ష కేసుల్లో విచారణా కోర్టు నిందితుడి నేర నిర్ధారణ చేయడానికి ముందుగానే సదరు నిందితుడు తన వైపు పరిస్థితులను పూర్తిగా, వివరంగా తెలియచేయడానికి అవకాశం కల్పించాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించాలంటూ సుప్రీం కోర్టు సోమవారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందింంచాలని కోరింది. చాలా మరణశిక్ష కేసుల్లో, నేరం చేసినట్లు విచారణా కోర్టు న్యాయమూర్తి నిర్ధారించిన రోజునే నిందితుడికి ఉరిశిక్ష విధిస్తారు. విచారణ జరిగినంత కాలమూ నిందితుడికి వ్యతిరేకంగా గల పరిస్థితులను వివరించేందుకు ప్రభుత్వానికి అవకాశం వుంది. కానీ, మరోవైపు నిందితుడు తనకు అనుకూలంగా గల పరిస్థితులు, సాక్ష్యాధారాలను చూపించగలిగే అవకాశాన్ని నేర నిర్ధారణ జరిగిన తర్వాతనే ఇస్తున్నారని కోర్టు పేర్కొంది. ఇటువంటి క్రిమినల్ విచారణలో నిందితుడికి వ్యతిరేకంగా పరిస్థితులు మారి కోలుకోలేని పర్యవసానాలకు అంటే నిందితుడి మృతికి దారి తీయవచ్చునని ప్రధాన న్యాయమూర్తి లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును తదుపరి పరిశీలన నిమిత్తం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించింది. ఇటువంటి కేసుల్లో తనకు వ్యతిరేకంగా మారిన పరిస్థితులతో నిందితుడు నిస్సహాయ స్థితిలో వుంటాడని తీర్పును రూపొందించిన జస్టిస్ రవీంద్ర భట్ వ్యాఖ్యానించారు. నేర నిర్ధారణ జరిగిన వెంటనే చాలా కేసుల్లో శిక్ష విధించడం ఒక లాంఛనంగా అయిపోయిందని, అక్కడ నిందితుడికి తన వాదన వినిపించుకునే అవకాశం వుండడం లేదని ఆయన పేర్కొన్నారు. శిక్ష పడిన తర్వాత తనకు పడిన శిక్ష గురించి మాట్లాడేకన్నా ముందుగానే నిందితుడికి అవకాశం కల్పించాలా లేదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించనుందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.