Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 డిమాండ్ల పరిష్కారానికి ఆందోళనలు
న్యూఢిల్లీ : హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఆశా వర్కర్ల జాతీయ మహాసభ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణకు పిలుపునిచ్చింది. అఖిల భారత స్థాయిలో ఆశా వర్కర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎడబ్ల్యుఎఫ్‌ఎఫ్‌ఐ) ఏర్పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి పోరాటాల భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడానికి అక్టోబర్ 19న ఢిిల్లీలో స్కీమ్ వర్కర్ల అఖిల భారత కన్వెన్షన్ నిర్వహించనున్నట్టు తెలిపింది. డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆశా వర్కర్ల సమస్యలపై నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అఖిల భారత నిరసన దినం పాటించాలని మహాసభ పిలుపునిచ్చింది. డిసెంబరు 2022 - జనవరి 2023లో అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ''జవాబ్ మాంగో అభియాన్'' పేరుతో స్కీమ్ వర్కర్ల ఆందోళన జరగనున్నది. 2023 మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏఐసీసీడబ్ల్యూడబ్ల్యూ (సీఐటీయూ) బ్యానర్లో చెల్లించని సంరక్షణ పని, భారీ సమీకరణపై ప్రచారం చేయనున్నట్టు తెలిపింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో జరిగే మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీకి భారీ ప్రచారం, గరిష్ట సమీకరణ చేయాలని పిలుపు నిచ్చింది.
డిమాండ్లు
1. సార్వత్రిక అప్లికేషన్, తగిన ఆర్థిక కేటాయింపులతో ఎన్హెచ్ఎం ప్రభుత్వం శాశ్వత ఆరోగ్య కార్యక్రమంగా మార్చండి.
2. ఆశా వర్కర్స్, ఫెసిలిటేటర్లకు 45వ, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సులను అమలు చేయండి. కార్మికులుగా క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు నెలకు రూ.26,000 కంటే తక్కువ కాకుండా ఇవ్వాలి. ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాటుటీ, పెన్షన్‌తో సహా అన్ని సామాజిక భద్రతా ప్రయోజనాలను నెలకు రూ.10,000 కంటే తక్కువ కాకుండా అందించాలి.
3. పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ, స్థిర ప్రాథమిక వేతనాలను పెంచాలి. వినియోగదారు ధరల సూచికకు లింక్ చేయాలి. ఆశాల వివిధ విధులకు ప్రోత్సాహకాలను సవరించాలి. వేతనాలు, భత్యాలు మొదలైన అన్ని బకాయిలను తక్షణమే చెల్లించాలి.
4. దేశవ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లకు ఒకే విధమైన పని పరిస్థితులు ఉండేలా చూడాలి.
5. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఎక్స్‌గ్రేషియాపై సుప్రీంకోర్టు తీర్పును స్కీమ్ వర్కర్లందరికీ వర్తింప చేసి, వెంటనే అమలు చేయాలి.
6. పెన్షన్ ఇచ్చే వరకు పదవీ విరమణ ఉండకూడదు. ఎక్స్‌గ్రేషియా, ఇతర సామాజిక భద్రతా చర్యలను తక్షణమే అమలు చేయాలి.
7. ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లందరికీ ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలను అందించాలి.
8. 20 రోజుల పాటు పెయిడ్ క్యాజువల్ సెలవులు, ఆశా వర్కరు, ఫెసిలిటేటర్లకు మెడికల్ లీవ్ కోసం ఖచ్చితమైన నియమాలను రూపొందించాలి.
9. ఆరోగ్య శాఖలో ఆశా వర్కరు, ఫెసిలిటేటర్లకు ప్రమోషన్ విధానాన్ని రూపొందించాలి. పెండింగ్‌లో ఉన్న ఏఎన్ఎం నియామకాల కోటాను నిర్ధారించే అంశం పరిష్కరించాలి.
10. మహమ్మారి వైరస్ నిర్మూలన ప్రకటన వరకు ఆశా కార్యకర్తలు, ఫెసిలిటేటర్లకు నెలకు రూ.1,000 రిస్క్ అలవెన్స్ (కోవిడ్ 19 ఇన్సెంటివ్)ని తక్షణమే పునరుద్ధరించాలి. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో రిస్క్ అలవెన్స్‌ను నెలకు రూ.10,000కి పెంచాలి.
11. కోవిడ్ డ్యూటీ సమయంలో మరణించిన అన్ని ఆశా వర్కరు, ఫెసిలిటేటర్ల వారసులకు రూ. 50 లక్షల జీవిత బీమాతో సహా అన్ని పరిహారాల ను తక్షణమే చెల్లించాలి. చికిత్స కోసం చేసిన ఖర్చులకు చెల్లింపు చేయాలి.
12. విధి నిర్వహణలో ఉన్న ఆశా కార్యకర్తల భద్రతను నిర్ధారించాలి.
13. పోష చట్టాన్ని అమలు చేయాలి. ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లకు ఇది వర్తించేలా చేయాలి.
14. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆసుపత్రులలో 'ఆశా' రూమ్‌లను ఏర్పాటు చేయాలి.
15. విధుల కోసం ఆశాలకు ప్రయాణ ఖర్చులను వాస్తవ రూపంలో చెల్లించాలి.
16. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ హక్కు కోసం చట్టాన్ని రూపొందించాలి. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి జీడీపీలో 6 శాతం కేటాయించాలి.
17. ఆరోగ్యం (ఆసుపత్రులతో సహా) వంటి అన్ని ప్రాథమిక సేవల ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డిహెచ్ఎం)ని ఉపసంహరించాలి. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్ఈలు), సేవల ప్రైవేటీకరణ ఆపాలి.
18. లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి. కార్మిక చట్టాల పరిధిలో ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లను చేర్చాలి.