Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 వరకూ 'నాన్ టీచింగ్ డేస్'గా ప్రకటించిన యూనివర్సిటీ
ఛండీగడ్ : విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయనే వివాదంపై న్యాయమైన, పారదర్శకమైన విచారణ చేస్తామని జిల్లా అధికారులు, పోలీసులు హామీ ఇవ్వడంతో ఛండీగడ్ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం తమ ఆందోళనను విరమించారు. పంజాబ్‌లోని మొహాలీలోని ఈ యూనివర్సిటికీ చెందిన అనేక మంది విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో లీకయ్యాయనే వార్తలతో శనివారం సాయంత్రం నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వేలాది మంది విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ ప్రాంగణం ఉద్రికత్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి భారీ భద్రతను ఏర్పాటుచేశారు. అలాగే మరోవైపు సోమవారం నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇద్దరు వార్డెన్లను యూనివర్శిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 24 వరకూ 'నాన్ టీచింగ్ డేస్'గా ప్రకటించారు. అంతేకాకుండా హాస్టల్ టైమింగ్స్‌తో పాటు విద్యార్థులకు చెందిన ఇతర డిమాండ్లను పరిష్కరించడానికి ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో విద్యార్థులు, సీనియర్ అధికారులు ఉంటారు. 'విద్యార్థులు మధ్యాహ్నం 1:30 గంటలకు తమ ఆందోళనను విరమించారు' అని మొహాలీ సీనియర్ ఎస్పి వివేక్ షీల్ సోని సోమవారం తెలిపారు. ఈ కేసును విచారించడానికి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. యూనివర్శిటీకి చెందిన అనేక మంది విద్యార్థినులు అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో లీకయ్యాయని, దీంతో కొంత మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఒక విద్యార్థిని మాత్రమే తన సొంత వీడియోను తన బారుఫ్రెండ్కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దర్ని అరెస్టు చేశామని ఆదివారమే తెలిపారు.