Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ-అమిత్ షాకు రాజకీయ ఆయుధంగా మారిన సీబీఐ!
- 95శాతం కేసులు ప్రతిపక్షాలపైన్నే..
- బీజేపీలో చేరగానే..కేసులు మటుమాయం!
- గాలి జనార్ధన్‌రెడ్డిపై కేసు ఏమైందో తెలియదు..
- సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో తీర్పును సవాల్ చేయని సీబీఐ
న్యూఢిల్లీ : అసోం ప్రస్తుత సీఎం హిమంత బిస్వా..ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు. శారదా చిట్ ఫండ్ కేసులో అతడిపై సీబీఐ దాడులు చేపట్టింది. బీజేపీలో చేరగానే..ఆ కేసు గాలికి కొట్టుకుపోయింది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కథా ఇదే. సీఎం హిమంత బిస్వ, అమరీందర్ సింగ్‌లపై కేసులు..ప్రధాని మోడీ హయాంలో సీబీఐ పనితీరుకు నిదర్శనం. సీబీఐ కేసులను సాకుగా చూపి..అనేక రాష్ట్రాల్లో రాజకీయ కుట్రలకు బీజేపీ తెరలేపిందని, తద్వారా అక్కడి ప్రభుత్వాల్ని కూల్చిందన్న ఆరోపణలున్నాయి. ప్రధాని మోడీ-అమిత్ షా రాజకీయ చదరంగంలో సీబీఐ ఒక పావుగా మారిందని 'జాతీయ ఆంగ్ల దినపత్రిక' ఒకటి తాజాగా వార్తా కథనం వెలువరించింది. మోడీ హయాంలో సీబీఐ 124 మంది ప్రమఖ రాజకీయ నాయకులపై కేసులు పెట్టగా, ఇందులో 118 కేసులు ప్రతిపక్ష నాయకులకు చెందినవి ఉన్నాయని, స్వతంత్ర ప్రతిపత్తి హోదా కలిగిన సీబీఐ పనితీరు సరిగా లేదని ఆ వార్తాకథనం పేర్కొన్నది. ఇందులో పేర్కొన్న మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పనితీరు మోడీ సర్కార్ హయాంలో ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడానికి రాజకీయ ఆయుధంగా మారిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు తలాడిస్తూ ఇష్టారీతిగా ప్రతిపక్ష నాయకులపై సీబీఐ కేసులు నమోదుచేస్తోంది. యూపీఏ పాలన (2004-14మధ్య)లో ప్రముఖ రాజకీయ నాయకులపై మొత్తం 72 సీబీఐ కేసులు నమోదుకాగా, ఇందులో ప్రతిపక్ష నాయకులపై పెట్టిన కేసుల సంఖ్య 43గా ఉంది. 2014 తర్వాత మోడీ సర్కార్ రాగానే సీబీఐని తన చెప్పుచేతుల్లోకి తీసుకుంది. దాంతో సీబీఐ స్వతంత్ర హోదా కాగితాలకే పరిమితమైంది.
స్వతంత్ర హోదా కాగితాలకే పరిమితం
వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చడానికి, రాజకీయ బెదిరింపులకు సీబీఐని ప్రయోగించటం సర్వసాధారణమైంది. మునుపెన్నడూ లేనంతగా సీబీఐ ప్రతిష్ట నేడు మసకబారిందని చెప్పక తప్పదు. ఉదాహరణకు కర్నాటకు చెందిన బీజేపీ నాయకుడు గాలి జనార్ధన్‌రెడ్డిపై సీబీఐ కేసుల విచారణ ఏమైందని స్వయంగా సుప్రీంకోర్టు కలుగుజేసుకొని ప్రశ్నించాల్సి వచ్చింది. జులై, 2019లో కేంద్రం మంత్రివర్గాన్ని ప్రధాని మోడీ మార్చారు. మొత్తం 78మందితో కూడిన మంత్రివర్గంలో 34మందిపై క్రిమినల్ కేసులున్నాయని 'అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్' వెల్లడించింది. ఇందులో 25శాతం తీవ్రమైన క్రిమినల్ నేరారోపణలని పేర్కొన్నది. హత్య, హత్యాయత్నం, దోపిడి..వంటి కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టదో ఎవ్వరికీ అర్థం కాదు. అధికార పార్టీ నాయకుల కేసుల విచారణ మూలన పడేస్తోందన్న ఆరోపణ సీబీఐ ఎదుర్కొంటోంది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న కొంతమంది నాయకులు బీజేపీలో చేరగానే ఆ కేసుల విచారణ ఆగిపోవటమూ చర్చనీయాంశమైంది. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పై కోర్టులో సీబీఐ సవాల్ చేయకపోవటమూ ఆ సంస్థ తీరుపై అనుమానాలు రేకెత్తించింది. యూపీఏ హయాంలో సీబీఐ 43మంది ప్రముఖ రాజకీయ నాయకులపై కేసులు నమోదుచేసింది. ఇందులో 12మంది బీజేపీకి చెందినవారున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుపై సీబీఐ విచారణ జరిపింది. ఇందులో అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే కర్నాటక మాజీ సీఎం యెడియూరప్ప, బళ్లారి మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, మాజీ రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, 2012నాటి 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో ప్రమోద్ మహాజన్..మొదలైనవారు సీబీఐ కేసుల్ని ఎదుర్కొన్నారు.
ఎడాపెడా కేసులు నమోదు
కేంద్రంలో మోడీ సర్కార్ రాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్ష నేతలపై సీబీఐ ఇష్టారీతిగా కేసులు నమోదుచేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్..మొదలైనవారు వివిధ కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీల వారీగా చూస్తే తృణమూల్ నేతలు-30, కాంగ్రెస్-26మంది, ఆర్జేడీ, బీజేడీ-10మంది, వైఎస్ఆర్సీసీ-6, టీడీపీ-5, ఆప్-4, ఎస్పీ-4, ఏఐఏడీఎంకే-4, ఎన్సీపీ-3, ఎన్సీ-2, డీఎంకే-2, పీడీపీ, టీఆర్ఎస్కు చెందిన ఒక్కొక్కరున్నారు.