Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడి వ్యాపారాలపై దృష్టి
- భద్రత, నాణ్యమైన జీవితానికి ప్రాధాన్యత
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వ్యాపార విధానాలపై సంపన్నులు, వ్యాపారుల్లో లోలోపల తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరోవైపు దేశంలో చోటు చేసుకుంటున్న విద్వేష ఘటనలు శాంతిని దెబ్బతీస్తుండటం పెట్టుబడిదారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది భారత సంపన్నులు విదేశాల్లో స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్ట్ చేసింది. వ్యాపారంతో పాటు నాణ్యమైన జీవితం కోసం భారత్‌ను వీడుతున్నారు. వ్యాపార యాజమానులు, నవ ఔత్సాహికవ్తేలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, నైపుణ్యం కలిగిన నిపుణుల దృష్టి విదేశాలపై పడింది. సంపద వైవిధ్యం, వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం, ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేయడం లేదా మెరుగైన జీవితాన్ని కొనసాగించడం వంటి వాటి కోసం విదేశాలలో మార్గాలను వెతుక్కుంటున్నారు. వీరంతా భారత్ ఇంకా ఎంతో దీర్ఘకాలం ఆకర్షణీయ గమ్యస్థానం కాదనే భావనలో ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న దేశంగా పాలకులు చెబుతున్నప్పటికీ ఇలాంటి చర్యలు చోటు చేసుకోవడం గమనార్హం.
సంపన్న భారతీయులు ఇతర దేశాల్లో కొన్ని మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం, శాశ్వత నివాసాలను కొనుగోలు చేయడం ద్వారా ఆయా దేశాలు ఇన్వెస్ట్మెంట్ వీసాలు లేదా గోల్డెన్ వీసాలు కల్పిస్తున్నాయి. ఆయా దేశాల్లో సురక్షితంగా ఉండొచ్చనే భావనతోనే ధనవంతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విసా కన్సల్టెంట్ కంపెనీ వై-యాక్సిస్ మిడిల్ ఈస్ట్ డీఎంసీసీ డైరెక్టర్ క్లింట్ ఖాన్ పేర్కొన్నారు. ''బహుశా మరొక సంక్షోభం రావొచ్చు. అది రష్యాలో మనం చూసినట్లుగా యుద్ధం కావచ్చు లేదా రాజకీయ సంక్షోభం కావచ్చు లేదా అమెరికాలో మనం చూస్తున్నట్లుగా సంపద పరిరక్షణకు ఆటంకం కలిగించే ఆర్థిక విధానాలు కావొచ్చు. అదే జరిగితే రెండో నివాసం ఉండాలని అనేక మంది భారతీయులు భావిస్తున్నారు'' అని హెన్లీ అండ్ పాట్నర్ కంపెనీ గ్రూపు హెడ్ నిర్బరు హండ పేర్కొన్నారు. దేశంలోని అత్యంత సంపన్నుల్లో 70-80 శాతం మంది వ్యక్తులు తమకు ప్రత్యామ్నాయ నివాస ఎంపికను సృష్టించుకున్నారు. దేశంలో ఏదైనా పెద్ద ఇబ్బందులు తలెత్తితే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ప్లాన్ బిని అనుసరించడానికి సిద్దంగా ఉన్నారు.'' అని జులిస్ బార్ ఇండియా వెల్త్ ప్లానింగ్ హెడ్ సోనాలి ప్రధాన్ పేర్కొన్నారు.
ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈఓ సిద్ధార్థ లాల్ 2015లో లండన్‌కు తన నివాసాన్ని మార్చారు. హీరో సైకిల్స్ చైర్మెన్, యండీ పంకజ్ ముంజాల్ కూడా యూరోపియన్ ఈ-బైక్ మార్కెట్‌పై దృష్టి సారించడానికి సంవత్సరానికి తొమ్మిది నెలలు లండన్‌లో గడుపుతున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా తరుచుగా లండన్ - పూణే మధ్య ప్రయాణాలు చేస్తున్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఎక్కువ సమయం విదేశాల్లోనే గడుపుతున్నారు. విదేశాల్లో ఉండాలనే వారి ప్రాధాన్యత గురించి మాట్లాడటానికి వారు ఇష్టపడటం లేదు. 2022లోనే దాదాపుగా 8,000 మంది పైగా సంపన్నులు భారత్‌ను వీడి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని ఇటీవల హెన్లీ అండ్ పార్ట్నర్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇందులో అత్యధిక మంది యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలను ఎంచుకున్నారని తెలిపింది. ఆయా దేశాల్లో సామాజిక భద్రతతో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉండటమే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 2015 నుంచి 2021 మధ్యలో దాదాపుగా 9 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేసినట్టు ప్రభుత్వ గణంకాలే స్వయంగా చెబుతున్నాయి. ప్రతీ ఏడాది వలస వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఇది భారత్‌లోని భద్రత, మౌలిక వసతుల కల్పన, అభివృద్థిలో వెనుకబాటును తెలియజేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.