Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీపిస్తోన్న అధ్యక్ష ఎన్నికలు
- బుధవారం రాత్రి ఢిల్లీకి రాహుల్
- ఇప్పటికే అధ్యక్ష పదవికి ఇద్దరు కీలక నేతలు సై
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ పోటీ చేయటంపైనే చర్చ జరిగినప్పటికీ, చివరికి ఆయనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు రాహుల్‌ను బుజ్జగిస్తూనే, మరోవైపు రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తే, రాహుల్ బరిలో నిలుస్తారని ఊహగనాలు వినిస్తోన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను ఢిల్లీకి అకస్మాత్తుగా పిలిచారు. మంగళవారం నాడిక్కడ సోనియాగాంధీ నివాసం(జన్‌పథ్10)లో ఆమెను కెసి వేణుగోపాల్ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికలపై చర్చించారు. అనంతరం కెసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష పదవికీ రాహుల్ గాంధీ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
నేడు ఢిల్లీకి రాహుల్
కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కూడా ఢిల్లీకి రమ్మని సోనియా గాంధీ పిలిచారు. అందులో భాగంగానే ఒక రోజు జోడో యాత్రను నిలిపివేసి, బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. గురువారం సోనియాగాంధీతో రాహుల్ భేటీ కానున్నారు. అనంతరం గురువారం రాత్రి మళ్లీ ఆయన కేరళకు వెళ్తారని సమాచారం. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని రాజస్థాన్, ఛత్తీస్గడ్, తెలంగాణ, కేరళ, జమ్ముకాశ్మీర్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేశాయి. ఇంకొన్ని రాష్ట్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే పోటీకి ఇద్దరు సై
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేరళకు చెందిన ఎంపీ శశిథరూర్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే శశిథరూర్ ఇప్పటికే సోనియా గాంధీని కూడా కలిశారు.
అయితే రాహుల్ గాంధీ బరిలోకి దిగితే, అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి అయిన శశి థరూర్, పార్టీని ప్రక్షాళన చేయాలని సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మందిలో ఒకరు. అలాగే ఆయన పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షుడు ఉండాలని గట్టిగా వాదిస్తున్నారు.