Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందలాది మందికి ఫిజికల్ ట్రైనింగ్ పేరిట శిక్షణ
- పట్టుపడిన నలుగురి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఎన్ఐఏ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలో ఒక వ్యూహం ప్రకారం మత విద్వేషాలను రగిల్చి భారీ ఎత్తున విధ్వంస రచనకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కుట్ర పన్నిందనీ, అందులో భాగంగానే దేహ దారుఢ్య శిక్షణ పేరిట వందలాది మంది ఒక వర్గానికి చెందిన యువతకు శిక్షణనివ్వసాగిందని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన నలుగురు నిందితుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది. రెండ్రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్ఐకి చెందిన 38 డెన్లపై దాడులు జరిపిన ఎన్ఐఏ ఇలియాజ్, ఉస్మాన్, ఇర్ఫాన్, వహీద్ లు అనే నలుగురు పీఎఫ్ఐకి చెందిన కీలక సూత్రధారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకముందే, గత జులైలో నిజామాబాద్ పోలీసులు పీఎఫ్ఐ నిజామాబాద్‌లో సాగిస్తున్న శిక్షణా కేంద్రాన్ని భగం చేసి ప్రధాన సూత్రధారి ఖదీర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులను ఆధారంగా చేసుకొని తదుపరి దర్యాప్తును సాగించిన ఎన్ఐఏ తాజాగా 23 మందిపై కేసులను నమోదు చేసి అందులో నలుగురిని అరెస్టు చేసింది. మిగతా నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలను చేపట్టింది. కాగా, ఎన్ఐఏ జరిపిన ప్రాథమిక విచారణలో పీఎఫ్ఐ పేరిట విద్రోహ చర్యలకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే గాక బీహార్, మహారాష్ట్ర, కర్నాటక కేరళలో కార్యకలాపాలను సాగిస్తున్నారని తేల్చింది. అంతేగాక, ఆయా ప్రాంతాల్లో దాడులు జరిపి కొందరు సూత్రధారులనూ అరెస్టు చేసింది. తాజాగా అరెస్టు చేసిన నిందితుల విచారణలో దేశంలో అంతర్గత శాంతి, భద్రతల విఘాతానికి మత వైషమ్యాలను భారీ ఎత్తున రెచ్చగొట్టటం ద్వారా పీఎఫ్ఐ వ్యూహా రచన చేసిందదని నిర్ధారణకు వచ్చింది. ఇందుకు శిక్షణ కోసమంటూ అనేక మంది నుంచి భారీ ఎత్తున నిధులనూ కూడబెట్టిందనీ, దాదాపు రూ. 8 కోట్లకు పైగా నిధులను దాతలు సమకూర్చినట్టు నిందితుల రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ పేర్కొన్నది. కుంగ్‌ఫూ, కరాటే వంటి ఆత్మరక్షణ శిక్షణతో పాటు కత్తులు, ఇనుపరాడ్లతో ఏ విధంగా శత్రువుపై దాడి నిర్వహించాలి, అవసరమైన ప్రాంతాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసంగాలు చేయాలి, స్థానికంగా ఘర్షణలు తలెత్తితో రాళ్లతో ఏ విధంగా దాడులు చేయాలి మొదలైన అంశాల్లో కార్యకర్తలకు శిక్షణనిచ్చినట్టు కూడా వివరించింది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఒక వర్గానికి చెందిన యువతకు దేహదారుఢ్య శిక్షణ పేరిట మత విద్వేష రచనను పీఎఫ్ఐ కొనసాగిస్తోందని ఎన్ఐఏ తెలిపింది. గతంలో అనేక రూపాల్లో కార్యకలాపాలు సాగించిన ఉగ్రవాద సంస్థలు దేశంలో కొత్త తరహా విద్వేషానికి ఇలాంటి కుట్రలను పన్నుతున్నట్టు ఎన్ఐఏ అనుమానిస్తోంది. కాగా, తమ దాడుల్లో వెలువడ్డ కొత్త అంశాలను దృష్టిలో ఉంచుకొని మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలను ఉధృతం చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.