Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రచార ఖర్చు..రూ.340కోట్లు
- ఎన్నికల వ్యయంపై ఈసీకి నివేదిక సమర్పించిన వివిధ పార్టీలు
- కాంగ్రెస్ ప్రచార వ్యయం రూ.194కోట్లు
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసిన పార్టీగా బీజేపీ ముందు నిలిచింది. దాదాపు రూ.340కోట్లకుపైగా మొత్తాన్ని ఎన్నికల ప్రచారం కోసం వ్యయం చేశామని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో బీజేపీ పేర్కొన్నది. బీజేపీ తర్వాత..కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ.194 కోట్లు ఖర్చు చేసినట్టు కాంగ్రెస్ పేర్కొన్నది. సాధారణ ప్రచారం, అభ్యర్థులకు పార్టీ ఇచ్చిన నిధుల వివరాల్ని పొందుపరుస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు నివేదికలు సమర్పించాయి. ఈ నివేదికల్లోని గణాంకాల్ని, వివరాల్ని ఈసీ తన వెబ్సైట్లో బుధవారం విడుదల చేసింది.ఆగస్టు 20న ఎన్నికల ప్రచార ఖర్చు వివరాల్ని ఈసీకి బీజేపీ సమర్పించింది. దీని ప్రకారం, పార్టీ సాధారణ ఎన్నికల ప్రచార వ్యయం, ఎన్నికల అభ్యర్థులకు పార్టీ ఇచ్చిన నిధులు..మొత్తంగా రూ.340కోట్లకు పైగా ఉందని బీజేపీ లెక్కలు చూపింది. ఉత్తరప్రదేశ్లో రూ.221కోట్లు, మణిపూర్లో రూ.23కోట్లు, ఉత్తరాఖండ్లో రూ.43కోట్లు, పంజాబ్లో రూ.36కోట్లు, గోవాలో రూ.19కోట్లు ఖర్చు చేశామని తెలిపింది. వర్చువల్ ప్రచారం నిమిత్తం రూ.11.97కోట్లు ఖర్చు చూపింది. జులై 11న కాంగ్రెస్ తన ఎన్నికల ఖర్చు వివరాల్ని ఈసీకి సమర్పించింది. సాధారణ ఎన్నికల ప్రచార నిమిత్తం రూ.102కోట్లు, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అభ్యర్థులకు రూ.90కోట్లు ఇచ్చామని కాంగ్రెస్ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితిని రూ.54 లక్షల నుంచి రూ.75లక్షలకు, లోక్సభ అభ్యర్థుల ఖర్చు రూ.70 లక్షల నుంచి రూ.95 లక్షలు పెంచింది.