Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్ వర్సిటీగా నామకరణం
- అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రకటన
- రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న నిరసనలు
అమరావతి : క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తికి క్రెడిట్ దక్కాలనే ఉద్దేశంతోనే విజయవాడలోని ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ పేరుగా మార్చేందుకు బుధవారం శాసనసభలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సిఎం మాట్లాడారు. శాసనసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై బాగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నన్ను నేను కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్నానన్నారు. మనం చేస్తున్నది కరెక్టేనా? అని ఆలోచించిన అనంతరం ఇది కరెక్ట్ అని అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలో 11మెడికల్ కళాశాలలు ఉండగా వీటిలో 8 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు టీడీపీ పుట్టక మునుపే అంటే 1983కు ముందే వచ్చాయని, వైఎస్ఆర్ హయాంలో శ్రీకాకుళం, ఒంగోలు, కడపలో మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశాయి. విజయవాడలోని ఎన్టిఆర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.