Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బిజినెస్ డెస్క్
కరోనా సంక్షోభ కాలంలోనూ భారత కార్పొరేట్ల సంపద లక్షలాది కోట్లు ఎగిసింది. దేశంలో ఓ వైపు పేదరికం సూచీ పెరిగిపోతుంటే మరోవైపు అదానీ, అంబానీ లాంటి వారు గ్లోబల్ దిగ్గజ పెట్టుబడిదారుల ఆస్తులను మించి సంపదను పోగు చేశారు. ప్రధానీ మోడీకి సన్నిహితులుగా పేరున్న గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీల సంపద అయితే జెట్ స్పీడ్‌తో పెరిగింది. దేశంలోని కేవలం 149 మంది సంపన్నుల వద్ద ఏకంగా రూ.100 లక్షల కోట్లు సంపద కేంద్రీకృతమైంది. గతేడాది అపారకుబేరుడు అదానీ సంపద ఏకంగా రెట్టింపు అయ్యింది. సరిగ్గా పదేండ్ల కిందట ముకేశ్ అంబానీలో ఆరోవంతు సంపద కలిగిన అదానీ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో టాప్-2 స్థానంలోకి వచ్చేశారు. 2021 ఏడాదికి గాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితా 2022ను బుధవారం వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. 2021లో రూ.10.94 లక్షల కోట్ల సంపదతో అదానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ముకేశ్ అంబానీ రూ.7.99 లక్షల కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ -10 సంపన్నుల మొత్తం సంపదలో అదానీ, అంబానీల వాటా 59 శాతంగా ఉండటం విశేషం.
రూ.1000 కోట్ల పైబడి సంపద కలిగిన వ్యక్తులను ఈ జాబితాలోకి తీసుకుని వారి ఆస్తి ఆదారంగా ఐఐఎఫ్ఎల్ ర్యాంకింగ్‌లను ప్రకటించింది. పదేండ్ల కిందట ఈ జాబితా 10 నగరాలలో 100 మంది వ్యక్తుల నుంచి ప్రారంభించగా.. ఇప్పుడు 76 నగరాలలో 1000కు పైగా ధనవంతుల జాబితాకు చేరింది. నూతన జాబితాలో క్విక్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జెప్టో వ్యవస్థాపకురాలు, అతి పిన్న వయస్కురాలు 19 ఏండ్ల కైవల్య వోహ్రా రూ.1000 కోట్ల సంపదతో అత్యంత యువ ధనవంతురాలిగా స్థానం దక్కించుకున్నారు.
హురున్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గడిచిన ఏడాదిలో అదానీ సంపద 116 శాతం పెరిగింది. రోజుకు సగటున రూ.1612 కోట్ల చొప్పున ఆర్జించడంతో ఒక్క ఏడాదిలోనే రూ5.88 లక్షల కోట్ల మేర సంపద పెరిగింది. దీంతో గడిచిన పదేండ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీని అదానీ దాటేశారు. గతేడాది అంబానీ సంపద 11 శాతం పెరగ్గా.. ఐదేండ్ల లో 115 శాతం పెరిగింది. రూ. 1.6 లక్షల కోట్ల నికర విలువతో అదానీ తమ్ముడు వినోద్ అదానీ కూడా ఆరో స్థానంలోకి రావడం విశేషం. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీతో సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ ఎస్ పూనావాలా సంపద 25 శాతం పెరిగి రూ.2.05 లక్షల కోట్లకు చేరడంతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివనాడార్ (రూ.1.85 లక్షల కోట్లు), డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకష్ణన్ దమానీ (రూ.1.75 లక్షల కోట్లు), వినోద్ శాంతిలాల్ అదానీ (రూ.1.69 లక్షల కోట్ల్లు), ఎస్పి హిందూజా (రూ.1.65 లక్షల కోట్లు), ఎల్ఎన్ మిత్తల్ (రూ.1.52 లక్షల కోట్లు), దిలీప్ సంఘ్వి (రూ.1.33 లక్షల కోట్లు), ఉదరు కోటక్ (రూ.1.19 లక్షల కోట్లు) చొప్పున సంపదతో వరుస టాప్-10 స్థానాల్లో ఉన్నారు.
12 మంది భారత కార్పొరేట్ల నికర సంపద విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువగా ఉంది. అదానీ గ్రూపు సంపద అప్రతిహతంగా ఎగిసిందని.. గతేడాది ఏకంగా ఏడు కంపెనీలను ఏర్పాటు చేసిన సంస్థగా ఉందని హురున్ ఇండియా ఎండీ, ముఖ్య పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు. మొదటి 149 మంది వ్యక్తుల మొత్తం సంపాదన రూ.100 లక్షల కోట్లను అధిగమించింది'' అని అనస్ రహ్మాన్ జునైద్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వీరే టాప్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సంపన్నుల జాబితానూ ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది సంపన్నులు ఉన్నారు. వీరి ఆస్తుల విలువ దాదాపు రూ.3.90 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 82 శాతం మంది హైదరాబాద్ కేంద్రంగా నివాసముంటున్నారు. ఈ రాష్ట్రాల నుంచి దివిస్ లాబొరేటరీస్ అధిపతి మురళి దివి రూ.56,200 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. హెటిరో ల్యాబ్స్ చీఫ్ పార్థసారథి రెడ్డి రూ.39,200 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. విర్చో లేబరేటరీస్, ఎంఎస్ఎన్ లేబరేటరీస్, సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ నుంచి ముగ్గురేసి చొప్పున అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తుల జాబితాలో నిలిచారు. ఈ ప్రాంతం నుంచి 11 మంది కొత్తగా జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండగా.. అందులో మహిమా దాట్లా రూ.8700 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఒక్క హైదరాబాద్ నగరం నుంచి 64 మంది సంపన్నులు ఈ జాబితాలో చోటు సంపాదించుకోగా, విశాఖపట్నం నుంచి ఐదుగురు, రంగారెడ్డి నుంచి ముగ్గురు చొప్పున ఈ జాబితాలో ఉన్నారు. ''దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం కేవలం ముగ్గురు మాత్రమే ఈ జాబితాలో ఉంటే ఇప్పుడు అది 78కు చేరింది. గత ఐదు సంవత్సరాలలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఈ సంఖ్య 200కు చేరుకోవచ్చు.'' అని అనస్ రహ్మాన్ జునైద్ అన్నారు.