Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీవీ ఛానల్స్‌లో విద్వేష ప్రసంగాలను అడ్డుకోకుండా కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : టీవీల్లో వస్తున్న విద్వేష ప్రసంగాలపై కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందని, మౌనంగా ఎందుకు ఉండాల్సి వస్తోందని ? సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ ఛానల్స్‌లో విద్వేష ప్రసంగాల్ని అడ్డుకోవటంలో యాంకర్ల పాత్ర చాలా ముఖ్యమైందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాలను అడ్డుకోకుండా కేంద్రం ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తోందని ప్రశ్నించింది. విద్వేష ప్రసంగాల్ని అడ్డుకోవటంపై గత ఏడాది పదుల సంఖ్యలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా పై వ్యాఖ్యలు చేసింది. ''ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న విద్వేష ప్రసంగాలకు నియంత్రణ లేకుండా పోయింది. అలాంటి వాఖ్యలు చేస్తున్న సమయంలో టీవీ యాంకర్లే అడ్డుకోవాలి. పత్రికా స్వేచ్ఛ ముఖ్యమైందే...కానీ మనకు మనమే ఒక హద్దు రేఖ విధించుకోవాలి'' అని జస్టిస్ కె.ఎం.జోసెఫ్ అన్నారు. ఈ అంశంపై న్యాయ కమిషన్ ఇప్పటికే కొన్ని సూచనలు చేసిందని, దీనిని పరిగణలోకి తీసుకొని కేంద్రం ఏమైనా చట్టం తీసుకువస్తుందా? లేదా ? అన్నది తేలాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు సూచన మేరకు న్యాయ కమిషన్ నిర్ధిష్ట చట్టాలను సిఫారసు చేస్తూ 2017లో నివేదిక సమర్పించింది. ''భారతదేశంలో ఏ చట్టంలోనూ విద్వేషపూరిత ప్రసంగాలను నిర్వచించలేదు. అయినప్పటికీ..కొన్ని చట్టాల్లో నిబంధనలు ఉన్నాయి. వాక్ స్వాతంత్య్రానికి మినహాయింపుగా ఎంపిక చేసిన ప్రసంగ రూపాలను ఆ చట్టాల్లో నిషేధించాయి'' అని కమిషన్ పేర్కొన్నది. అలాగే కొత్త చట్టాన్ని చేయాలని సూచన చేసింది. అదెలా ఉండాలో తెలిపింది. ''విద్వేషం, రెచ్చగొట్టే ప్రసంగాల్ని నిషేధించేందుకు కొత్త సెక్షన్ 153సి, ఒక వర్గంలో భయాన్ని, ఆందోళనను, హింసకు ప్రేరేపించటం..వంటివి అడ్డుకునేందుకు సెక్షన్ 505ఏ తీసుకురావొచ్చునని..లా కమిషన్ పేర్కొన్నది.
టీవీ ఛానల్స్‌లో సాయంత్రం చర్చలు..సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ చర్చల్లో వచ్చే విద్వేష ప్రసంగాల్ని అడ్డుకోవటంలో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న కంపెనీలు విఫలమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై కొద్ది రోజుల క్రితం గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్..తదితర కంపెనీలు స్పందించాయి. హింసాత్మక కంటెంట్‌ను తొలగించటం, ఆన్లైన్లో తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు చేపడతామని ఆ కంపెనీల ప్రతినిధులు అమెరికాలో జరిగిన ఒక సదస్సులో ప్రకటించాయి.