Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్యుడికి మరో షాక్
- దేశీయంగా బియ్యం ధరలు పెరగొచ్చు.: కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ
మార్కెట్లో కిలో బియ్యం రూ. 46 నుంచి 56లకు తక్కువేమి లేదు. మరోవైపు ధాన్యం దిగుబడి పడిపోవటంతో...బియ్యం ఉత్పత్తి తగ్గొచ్చని అంచనా.ఇప్పటికే బువ్వ దొరక్క పేద జనం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు దేశీయంగా బియ్యం ధరలు పెరగొచ్చని కేంద్రం సంకేతాలు ఇస్తుంది. సామాన్య. మధ్యతరగతి జనంపై భారం పడనున్నది.
- బియ్యం ఉత్పత్తి తగ్గొచ్చు.: వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా
- దేశంలోని పేదలపై తీవ్ర ప్రభావం : ఆహార నిపుణులు
న్యూఢిల్లీ : మోడీ పాలనలో సగటు భారతీయుడు ధరాఘాతంతో దెబ్బతింటున్నాడు. ఇంధన, నిత్యవసర ధరలు దేశంలోని ప్రజలకు ఇప్పటికే చుక్కలు చూపించాయి. జీఎస్టీ దెబ్బతో పన్ను పోటుకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం దేశంలోని సామాన్య ప్రజానీకానికి మరొక షాకింగ్ వార్తను చెప్పింది. దేశీయంగా బియ్యం ధరల పెరుగుదల కొనసాగవచ్చని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. గత ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే దేశంలో బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం అంచనా వేసింది. గతేడాది ఖరీఫ్ సీజన్లో బియ్యం ఉత్పత్తి 1177.6 లక్షల టన్నులుగా ఉంటే.. అది ఈ ఏడాది 1049.9 లక్షల టన్నులు ఉండొచ్చని వివరించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిన తర్వాతి రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి పై ప్రకటన రావటం గమనార్హం. అయితే, ఇది దేశంలో ఆకలితో బాధపడుతున్న పేద తరగతి ప్రజలకు తీవ్ర సంక్లిష్ట పరిస్థితులను తీసుకొస్తాయని నిపుణులు చెప్పారు. ఇప్పటికే పోషకాహార లోపం సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది మరొక భారం అవ్వక తప్పదని వివరించారు.
పెరిగిన బియ్యం, గోధుమలు ధరలు
దేశంలో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి రోజువారీ సగటు రిటైల్, హౌల్‌సేల్ ధరలు ఏడాది క్రితం కంటే 9 నుంచి 20 శాతం పెరిగిన రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వాటి ధరలతో పోలిస్తే భారత్‌లో రోజువారీ సగటు రిటైల్ ధరలు.. బియ్యం 9.03 శాతం, గోధుమలు 14.39 శాతం, గోధుమ పిండి 17.87 శాతం పెరిగాయి. ఒక ఏడాది క్రితం వాటి ధరలతో పోలిస్తే భారత్‌లో రోజువారీ సగటు హౌల్‌సేల్ ధరలు.. బియ్యం 10.16 శాతం, గోధుమలు 15.43 శాతం, గోధుమ పిండి 20.65 శాతం ఎక్కువగా ఉన్నాయి.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ బుధవారం 2022-23 ప్రధాన ఖరీఫ్ పంటల ఉత్పత్తికి సంబంధించిన మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్లో ఖరీఫ్ బియ్యం ఉత్పత్తి 1049.9 లక్షల టన్నులు చేరుకున్నది. ఇది గత సీజన్లో నమోదైన ఉత్పత్తి 1117.6 లక్షల టన్నుల కంటే తక్కువ. ఖరీఫ్ వరి ఉత్పత్తి అంచనాలు ప్రస్తుత సీజన్లో నిర్దేశించబడిన 1120 లక్షల టన్నుల లక్ష్యం కంటే తక్కువగా ఉన్నాయి. 2020-21కి గానూ 1052.1 లక్షల టన్నులు ఉత్పత్తి నమోదైంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం పంపిణీకి బియ్యం అవసరమయ్యే దృష్ట్యా ఖరీఫ్ బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఖరీఫ్ సీజన్ 2022లో వరి విస్తీర్ణం, ఉత్పత్తిలో ఆరు శాతం లోటు ఉండవచ్చని ఆహార మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ''దేశీయ ఉత్పత్తిలో 60-70 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఉత్పత్తి నష్టం ముందుగా అంచనా వేయబడింది. ఇప్పుడు, 40-50 ఎల్ఎంటీ ఉత్పత్తి నష్టం అంచనా వేయబడింది. ఉత్పత్తి అవుట్‌పుట్ ఈ ఏడాది ఎక్కువగా ఉండదని అంచనా వేయబడింది. కానీ, గతేడాదితో సమానంగా ఉంటుంది'' అని ఈ ప్రకటన పేర్కొన్నది. '' బియ్యం దేశీయ ధరలు పెరుగుతున్న ధోరణిని చూపుతున్నాయి. తక్కువ ఉత్పత్తి అంచనా కారణంగా 60 లక్షల మెట్రిక్ టన్నులు వరి, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే బాస్మతీయేతర ఎగుమతుల్లో 11 శాతం పెరుగుదల కారణంగా ఇది పెరుగుతూనే ఉంటుంది'' అని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత బియ్యం ఎగుమతి నియమాలలో ఇటీవలి మార్పులు ఎగుమతులకు లభ్యతను తగ్గించకుండా దేశీయ ధరలను నియంత్రించటంలో సహాయపడతాయని ప్రకటన వివరించింది. '' ఖరీదైన చమురు దిగుమతులను ఆదా చేసే ఇథనాల్-బ్లెండింగ్ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పాలు, మాంసం, గుడ్ల ధరలపై ప్రభావం చూపే పశుగ్రాసం ధరను తగ్గించటం ద్వారా పశుపోషణ, పౌల్ట్రీ రంగాలకు సహాయపడే అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయబడ్డాయి. పశుగ్రాసంతో సహా వస్తువుల ధరలపై ప్రభావం చూపిన భౌగోళిక-రాజకీయ దృష్టాంతం కారణంగా విరిగిన బియ్యానికి (నూకలు) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. గత నాలుగేండ్లలో విరిగిన బియ్యం ఎగుమతి 43 రెట్లు పెరిగింది. ఏప్రిల్-ఆగస్టు, 2022 నుంచి 21.31 ఎల్ఎంటీ ఎగుమతి చేయబడింది. 2019లో అదే కాలంలో 0.51 ఎల్ఎంటీగా ఉన్నది. 2021 ఏడాదిలో ఎగుమతి చేయబడిన పరిమాణం 15.8 ఎల్ఎంటీ(ఏప్రిల్-ఆగస్టు, 2021). ప్రస్తుత సంవత్సరంలో విరిగిన బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి '' అని ప్రకటన పేర్కొన్నది. విరిగిన బియ్యం ఎగుమతి పెరగటంతో కలిగే ప్రభావాన్ని ఎత్తి చూపుతూ, '' బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 16గా ఉన్న విరిగిన బియ్యం దేశీయ ధర, రాష్ట్రాల్లో కిలోకు రూ.22కి పెరిగింది. పౌల్ట్రీ రంగం, పశుసంవర్థక రైతులు దాణా పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యారు. కారణం, పౌల్ట్రీ ఫీడ్ కోసం 60-65శాతం ఇన్పుట్ ఖర్చు విరిగిన బియ్యం నుంచి వస్తుంది. ఫీడ్‌స్టాక్ ధరలలో ఏదైనా పెరుగుదల పాలు, గుడ్డు, మాంసం మొదలైన పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలలో ప్రతిబింబిస్తుంది. ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం, ముడి బ్రోకెన్ రైస్ (హెచ్ కోడ్ 1006-4000) ఎగుమతి కోసం పరివర్తన సడలింపు ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు ఉన్నది. కానీ, ఇప్పుడు సెప్టెంబరు 30 వరకు పొడిగించబడింది.