Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కెనడాలో విద్వేషపు నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నందున అక్కడికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది. భారతీయులు, విద్యార్థులు ఒట్టావాలోని భారత మిషన్లో లేదా టొరంటో, వాంకోవర్ల్లోని రాయబార కార్యాలయాల్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో లేదా అవసరమైనపుడు భారతీయ దౌత్య కార్యాలయ సిబ్బందికి సమాచారమివ్వాలని తెలిపింది. విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలపై విచారణ చేపట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వానికి సూచించామని విదేశాంగ శాఖ పేర్కొంది. కెనడాలో ఈ నేరాలకు పాల్పడిన వారు ఇప్పటివరకు న్యాయస్థానం ముందుకు రాలేదని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజా భిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీతీసిన సమయం లోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు.కెనడాలో 1.6 మిలియన్ల మంది భారతీయ మూలాలు కలిగిన వారు, ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. వారు కెనడా జనాభాలో 3శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇటీవల భారతీయులే లక్ష్యంగా దుండగులు కాల్పులు జరుపుతుండటంతో కేంద్రం కీలక సూచనలు చేసింది.