Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముట్టుతోందన్న రిపోర్టులు దలాల్ స్ట్రీట్‌ను దడదడలాడేలా చేసింది. మాంద్యం సంకేతాలకు తోడు అమెరికా ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల పెంపు, హెచ్చు ద్రవ్యోల్బణం అంశాలకు తోడు రూపాయి విలువ దారుణంగా పడిపోతుండటంతో భారత మార్కెట్లు వారాంతం సెషన్లో భారీ నష్టాలను చవి చూశాయి. ఒక్క పూటలోనే దాదాపు రూ.5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. ప్రారంభం నుంచే అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 1,100 పాయింట్లు నష్టపోగా.. తుదకు 1,021 పాయింట్లు లేదా 1.73 శాతం పతనమై 58,099కు పడిపోయింది. ఏ దశలోనూ సానుకూల సంకేతాలు కానరాకపోవడంతో రోజంతా అమ్మకాల పరంపర కొనసాగింది. సెన్సెక్స్ బాటలోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ 302 పాయింట్లు లేదా 1.72 శాతం పతనమై 17,327 వద్ద ముగిసింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,90,162 కోట్లు పడిపోయి రూ.2,76,64,566 కోట్లుగా నమోదయ్యింది. మూడు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా రూ.6.8 లక్షల కోట్లు ఆవిరి కావడంతో మదుపర్లు బోరుమంటున్నారు. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.28 శాతం, 1.92 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్-30లో కేవలం సన్ ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. మిగితా సూచీలన్నీ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.
ప్రతికూలాంశాలు..
అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచి 3.25 శాతానికి చేర్చింది. ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చని ఫెడ్ అంచనా వేసింది. ఈ పరిణామం వర్థమాన దేశాల మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ద్రవ్యోల్బణ కట్టడికి బ్రిటన్, స్విట్జర్లాండ్ సైతం రేట్లను పెంచాయి. ఇదే బాటలో ఈ నెల చివరలో ఆర్బిఐ కూడా వడ్డీ రేట్లను పెంచనుందన్న రిపోర్టులు మదుపర్లను ఆందోళనకు గురి చేశాయి. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 81ని దాటడం మరింత ఆందోళనను పెంచింది. మరోవైపు భారత వృద్ధి రేటు అంచనాలకు కోత వేసినట్లు నోమురా, గోల్డ్‌మన్ శాక్స్, మూడీస్, ఏడీబీ లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రకటనలు మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. రూపాయి పతనం, వాణిజ్య లోటు పెరగడం, ఎగుమతులు అంతంత మాత్రంగా ఉండటం, ఆర్బిఐ వద్ద ఫారెక్స్ నిల్వలు పడిపోతుండటం తదితర అంశాలు భారత ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు పెంచడం దలాల్ స్ట్రీట్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి.